ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30.
డిజిటల్ సంతకం..
డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్‌మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్‌మెంటు ఆన్‌లైన్‌లో మెషీన్ ద్వారా జరుగుతుంది.
ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్‌టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి.
ట్యాక్సేషన్ నిపుణులు
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ,
ట్యాక్సేషన్ నిపుణులు
కె.వి.ఎన్ లావణ్య
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
Published Mon, Jul 12 2021 3:39 PM | Last Updated on Mon, Jul 12 2021 3:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment