Full Details About Controversy Around Jeff Bezos Superyacht Y721 - Sakshi
Sakshi News home page

జెఫ్‌ బేజోస్‌ కాచుకో.. కుళ్లిన కోడిగుడ్లతో దాడి చేస్తాం!

Published Mon, Feb 7 2022 3:44 PM | Last Updated on Mon, Feb 7 2022 6:57 PM

Full Details About Controversy Around Jeff Bezos Superyacht Y721 - Sakshi

అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బేజోస్‌ ఊహించని చిక్కుల్లో పడ్డారు. ఎంతో ముచ్చపడి తయారు చేయించుకున్న పడవ ఆయన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. అలలపై ప్రయాణం మొదలుకాకముందే ఆయన్ని వివాదాల్లోకి ముంచింది. 

మెగాయాచ్‌
ఎలన్‌మస్క్‌ కంటే ముందు ప్రపంచంలో నంబర్‌ ధనవంతుడిగా రికార్డులెక్కారు జెఫ్‌ బేజోస్‌. దాదాపు 200 బిలియన్‌ డాలర్లకు సంపద ఆయన సొంతం. ఈ క్రమంలో తను సేద తీరేందుకు.. విహార యాత్రలు చేపట్టేందుకు సర్వాంగ సుందరంగా.. సకల సౌకర్యాలతో ఓ పడవ (మెగాయాచ్‌) తయారు చేయించుకోవాలని నిర్ణయించారు. కస్టమైజ్డ్‌ యాచ్‌లు తయారు చేసే ఓ డచ్‌ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.

హలాండ్‌లో నిర్మాణం
హలాండ్‌లోని ప్రముఖ పోర్టు సిటీల్లో రోటెర్‌డామ్‌ దగ్గరున్న ఆల్‌బ్లెస్సర్‌డామ్‌లో Y721 పేరుతో మెగాయాచ్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పడవ ఖరీదు రమారమీ 485 మిలియన్‌ డాలర్లు. ఎట్టకేలకు ఫుట్‌బాల్‌ స్టేడియం కంటే పెద్దదిగా ఈ యాచ్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యాచ్‌ని సముద్రంలో ప్రవేశపెట్టే సమయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. రోటెర్‌డామ్‌లో చారిత్రక సంపదగా భావించే ఓ వంతెన యాచ్‌ ప్రయాణానికి అడ్డుగా నిలిచింది.

చారిత్రక వంతెన
యాచ్‌ని తయారు చేసిన చోటు నుంచి సముద్రంలోకి తీసుకెళ్లే నీటి ప్రవాహంపై పురాతన కాలం నాటి కోనింగ్‌షావెన్‌ అనే వంతెన ఉంది. దీనిని మొదటిసారి 1878లో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ నాజీలతో జరిగిన యుద్దంలో బాంబింగ్‌ కారణంగా ఈ వంతెన పాడవగా.. తిరిగి పునర్మించారు. అప్పటి నుంచి ఈ వంతెన ఓ చారిత్రాత్మక కట్టడంగా స్థానికులు భావిస్తున్నారు. చివరిసారి 2017లో  వంతెనకు మరమ్మత్తులు చేశారు. 

వంతెన కూల్చేద్దాం
జెఫ్‌బేజోస్‌ కోసం తయారు చేసిన మెగా యాచ్‌ను సముద్రంలోకి పంపే క్రమంలో పురాతన వంతెన అడ్డుగా ఉన్నందున... పాక్షికంగా వంతెనను కూల్యేయాలంటూ పడవ తయారీ సంస్థ రోటెర్‌డామ్‌ పాలకమండలకి విజ్ఞప్తి చేసింది. యాచ్‌ను సముద్రంలో పంపిన తర్వాత వంతెన పునర్‌ నిర్మాణానికి నిధులు అందిస్తామని పేర్కొంది.

మేం ఒప్పుకోం
జెఫ్‌ బేజోస్‌ పడవ వెళ్లేందుకు తమ చారిత్రక కట్టడానికి కూల్చాలనే ప్రతిపాదనలను రోటెర్‌డామ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంతెన కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. తమ సెంటిమెంట్స్‌ పట్టించుకోకుండా వంతెన కూల్చి ఈ మార్గంలో జోఫ్‌ బేజోస్‌ పడవని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లతో యాచ్‌పై దాడి చేస్తామంటూ తమ కార్యాచరణ ప్రకటించారు. సోషల్‌ మీడియాలో ఈ కోడిగుడ్ల దాడికి మద్దతు రోజురోజుకి పెరుగుతోంది. 

బాయ్‌కాట్‌ అమెజాన్‌
ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక ఇటు రోటెడ్‌డ్యామ్‌ పాలకమండలి, అటు పడవ తయారీ కంపెనీలు బిక్కచచ్చిపోయాయి. మరోవైపు జెఫ్‌బేజోస్‌కి వ్యతిరేకంగా బాయ్‌కాట్‌ అమెజాన్‌ అంటూ గళం విప్పుతున్నారు. మొత్తంగా ఈ కొత్త పడవ వ్యహారం జెఫ్‌బేజోస్‌కి టైటానిక్‌లా మారింది.

చదవండి: అమెజాన్‌ బాస్‌ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement