పోర్టుల నుంచి పవర్ వరకూ అనేక వ్యాపారాలు నిర్వహించే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు, 2022 సెప్టెంబర్ కాలంలో ఆయన సంపద దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ ఓ నివేదిక ఆయన్ను పాతాళానికి పడేసింది. దాని నుంచి బయటపడిన అదానీ పడిలేచిన కెరటంలా మళ్లీ అపర కుబేరుడి స్థానానికి చేరారు.
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ స్థానం ఒక్కరోజులో మారిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటి అత్యంత సంపన్న భారతీయుడిగా, ప్రపంచంలోని 12వ అత్యంత ధనికుడిగా గౌతమ్ అదానీ నిలిచారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో తాజా అప్‌డేట్ సూచించింది.
ఒక్క రోజులో రూ.63 వేల కోట్లు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అదానీ సంపద ఒక్క రోజులోనే ఏకంగా 7.67 బిలియన్ డాలర్లు (సుమారు రూ.63 వేల కోట్లు) పెరిగింది. ఇప్పుడాయన నెట్‌వర్త్ 97.6 బిలియన్ డాలర్ల (రూ.8.1 లక్షల కోట్లు)కు చేరింది. 97 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) ముఖేష్ అంబానీ సంపదను అధిగమించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ దేశీయ మార్కెట్లలో ఊపందుకుంటున్న నేపథ్యంలో గౌతమ్ అదానీ సంపద త్వరలోనే 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను సైతం దాటుతుందని భావిస్తున్నారు.
బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ కొత్త ఏడాది 2024లో ఇప్పటివరకు తన సంపదలో 13.3 బిలియన్ డాలర్లు (రూ.1.1లక్షల కోట్లు) పెంచుకున్నారు. ఒక వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో సంపద పెరుగుదల ఇదే ఎక్కువ. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 665 మిలియన్ డాలర్లు (రూ.5,530 కోట్లు) మాత్రమే పెరిగింది.
పాతాళానికి పడేసిన నివేదిక
పోర్ట్స్ టు పవర్ వ్యాపార సమ్మేళనం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒకప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు, ఆయన సంపద 2022 సెప్టెంబర్ కాలంలో దాదాపు 149 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. కానీ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక స్కై-హై వాల్యుయేషన్‌లను ఉటంకిస్తూ అదానీ గ్రూప్ స్టాక్‌లు 85 శాతం పడిపోతాయని అంచనా వేసింది.
అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 150 బిలియన్ డాలర్లు క్షీణించాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి 27న అదానీ వ్యక్తిగత సంపద 37.7 బిలియన్ డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడడానికి ఒక రోజు ముందు వరకూ అదానీ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్నుడు.
Comments
Please login to add a commentAdd a comment