
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ చక్కని వృద్ధి చక్రంలోకి ప్రవేశించిందని.. ఈ దిశలో వచ్చే రెండు దశాబ్దాల కాలంలో (20 ఏళ్లలో) 15 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.1110 లక్షల కోట్లు)చేరుకుంటుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వ్యక్తం చేశారు. కరోనా రాక ముందు మన దేశ జీడీపీ 2.89 ట్రిలియన్ డాలర్లు(రూ.214 లక్షల కోట్లు)గా ఉంది. సోమవారం గ్రూపు వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి అదానీ మాట్లాడారు. రానున్న నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల పరిమాణానికి చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ.. దీన్ని భారత్ చేరుకుంటుందని, ఇందులో తనకు ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ‘‘భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఆ తర్వాత 15 ట్రిలియన్ డాలర్ల పై స్థాయికి వచ్చే రెండు దశాబ్దాల్లో చేరుకుంటుంది’’ అని చెప్పారు. వినియోగం, మార్కెట్ పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment