ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.
‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపు
ఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment