ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్వర్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించినప్పటికీ రబ్బర్ కెమికల్స్ కంపెనీ నోసిల్ లిమిటెడ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
గ్లోబస్ స్పిరిట్స్ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 161 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం రెట్టింపై రూ. 25 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 292 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 170 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో ఈ షేరు 90 శాతంపైగా ర్యాలీ చేయడం విశేషం!
నోసిల్ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో నోసిల్ లిమిటెడ్ నికర లాభం 64 శాతం నీరసించి రూ. 12 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 54 శాతం క్షీణించి రూ. 107 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 81 శాతం పడిపోయి రూ. 9.3 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు కారణంగా టైర్ల కంపెనీల నుంచి ప్రొడక్టులకు డిమాండ్ పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇకపై రబ్బర్ కెమికల్స్‌కు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేసింది. చైనా స్థానే కంపెనీకి మరిన్ని ఆర్డర్లు లభించగలవని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నోసిల్ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 132.5 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది!
Comments
Please login to add a commentAdd a comment