దేశంలో బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఈ హెచ్‌యూఐడీ ఉన్న బంగారు ఆభరణాలనే కొనాలి లేదా అమ్మాలి.
(ఐఫోన్లకు కొత్త అప్‌డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!)
భారతదేశంలో బంగారు ఆభరణాలను అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా కొనుగోలు చేస్తుంటారు. చాలా వరకు బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటికి ఇప్పటి వరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలతో కూడిన హాల్‌మార్కింగ్ ఉండేది.
హాల్‌మార్కింగ్
గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ ఇచ్చే గుర్తింపు. ఇది 2021 జూన్ 16 వరకు స్వచ్ఛందంగా ఉండేది. అంటే తప్పనిసరి కాదు. ఆ తర్వాత 2021 జూలై 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
పాత హాల్‌మార్కింగ్‌లో నాలుగు అంశాలు ఉండేవి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, నగల వ్యాపారికి సంబంధించిన లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్. HUID హాల్‌మార్కింగ్‌లో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది.
(ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు)
పాత బంగారంపై ఆందోళన వద్దు
అయితే తమ వద్ద పాత బంగారు ఆభరణాల సంగతేంటని వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత హాల్‌మార్కింగ్ ఆభరణాలు కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
స్వచ్ఛతలో తేడా ఉంటే రెండు రెట్ల పరిహారం
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018లోని సెక్షన్ 49 ప్రకారం... వినియోగదారు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ముద్రించిన హాల్‌మార్క్‌లో ఉన్న దానికంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే కొనుగోలుదారు రెండు రెట్ల పరిహారం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment