ముత్తూట్ ఫైనాన్స్‌తో ఒప్పందం
ప్రాంతీయ భాషలలో జెమినీ ఏఐ
గూగుల్ ఇండియా సదస్సులో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది.
అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్‌ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది.
వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు.
తెలుగులోనూ..
ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్‌ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్‌వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్‌ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది.
తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్‌కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment