సాక్షి,ముంబై: రికార్డు స్థాయికి చేరి కొనుగోలుదారులను భయపెట్టిన పుత్తడి ధర క్రమేపీ దిగి వస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు మంగళవారం భారీ క్షీణతను నమోదు చేశాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 1,049 తగ్గింది. చివరకు రూ.48,569 వద్ద 49 వేలకు దిగువన స్థిరపడింది. అంతకుముందు సెషన్‌లో 10 గ్రాముల ధర 49,618 రూపాయల వద్ద ముగిసింది. అలాగే వెండి ధర కూడా కిలోకు 60 వేల దిగువకు చేరడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. మంగళవారం కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301 పలికింది.. కరోనా టీకాలపై ఆశలు, ట్రయల్స్‌లో పురోగతితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలతో బంగారం పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,830 డాలర్లుగా పలకగా, వెండి ధర 23.42 డాలర్ల వద్ద ఉంది.
దీనికి అధికార బదిలీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం, రూపాయి మారకం బలపడటం వంటి కారణాలు కూడా బంగారం ధరల క్షీణతకు ఊతమిచ్చాయి. అందువల్ల మదుపరులు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారని , హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు తపన్ పటేల్ వ్యాఖ్యానించారు. అమెరికా బిజినెస్ యాక్టివిటీ డేటా సానుకూలతతో బంగారం ధర పడిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీనీత్ దమాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment