
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. నేడు పాలసీ నిర్ణయాలను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ పరపతి నిర్ణయాలు భారత కాలమానం ప్రకారం నేటి అర్ధరాత్రి వెలువడనున్నాయి. కొద్ది రోజులుగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న కోవిడ్-19 కట్టడికి ఫెడరల్ రిజర్వ్.. భారీ సహాయక ప్యాకేజీలతోపాటు, నామమాత్ర వడ్డీ రేట్లను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా కదులుతున్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..
అటూఇటుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 66 బలపడి రూ. 51,835 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 42 క్షీణించి రూ. 68,925 వద్ద కదులుతోంది.
లాభాలతో
ఎంసీఎక్స్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా బలపడగా.. వెండి యథాతథంగా నిలిచింది. 10 గ్రాముల పుత్తడి రూ. 82 పుంజుకుని రూ. 51,769 వద్ద ముగిసింది. తొలుత 51,847 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,334 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ నామమాత్రంగా రూ. 2 లాభపడి రూ. 68,967 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 69,887 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,199 వరకూ నష్టపోయింది.
కామెక్స్‌లోనూ..
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం ధరలు పుంజుకోగా.. వెండి బలహీనపడింది. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,968 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.3 శాతం బలపడి 1961 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి ఔన్స్ 0.2 శాతం తక్కువగా 27.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment