దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు గురువారం వెనకడుగు వేశాయి. ఇదే విధంగా యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి కారణంగా గురువారం న్యూయార్క్ కామెక్స్‌లోనూ నీరసించాయి. అయితే ఆర్థిక రివకరీకి సంకేతంగా గత వారానికల్లా యూఎస్‌లో నిరుద్యోగిత 8 లక్షల దిగువకు చేరడంతోపాటు, గృహ విక్రయాలు 14ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు తాజాగా వెల్లడించాయి. దీంతో 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 0.84 శాతానికి బలపడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఇక ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 59 పెరిగి రూ. 50,825 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 63 క్షీణించి రూ. 62,552 వద్ద కదులుతోంది.
లాభాలకు బ్రేక్
వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు గురువారం డీలా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 569 క్షీణించి రూ. 50,764 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,199 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,535 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 931 పతనమై రూ. 62,698 వద్ద నిలిచింది. ఒక దశలో 63,250 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,856 వరకూ క్షీణించింది.
కామెక్స్‌లో..
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,907 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ దాదాపు యథాతథంగా 1,905 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం అక్కడక్కడే అన్నట్లుగా ఔన్స్ 24.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment