బంగారం, వెండిపై కేంద్రం షాక్‌ | Gold Silver Imports To Turn Costlier Govt Doubles Duty To 10pc, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బంగారం, వెండిపై కేంద్రం షాక్‌

May 13 2026 5:21 AM | Updated on May 13 2026 11:57 AM

Gold Silver Imports To Turn Costlier Govt Doubles Duty To 10pc

సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. 

భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది.  ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్‌లాండ్‌ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement