
వెండి, బంగారం.. జంటగా సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. సోమవారం 9ఏళ్ల తదుపరి చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన పసిడి నేటి ట్రేడింగ్‌లో మరో కొత్త శిఖరాన్ని చేరుకుంది. ప్రపంచ బులియన్ చరిత్రలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) పసిడి తొలుత 2000 డాలర్లను తాకింది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో 2 శాతం బలపడి 1991 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. ఇంతక్రితం 2011 సెప్టెంబర్‌లో 1921 డాలర్ల వద్ద నమోదైన రికార్డ్ "హై'ను సోమవారం 1956 డాలర్లకు చేరడం ద్వారా అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా వెండి (ఔన్స్) మరింత అధికంగా 6.5 శాతం దూసుకెళ్లి 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 ఏప్రిల్ తదుపరి గరిష్టాన్నిచేరింది. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి ధరలు సోమవారం హైజంప్ చేశాయి.
వెండి దూకుడు
సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములు రూ. 1066 ఎగసి రూ. 52,101 వద్ద ముగిసింది. ఈ ఆగస్ట్ డెలివరీ ఫ్యూచర్స్ తొలుత రూ. 52,220 వరకూ పెరిగింది. ఇక వెండి కేజీ సెప్టెంబర్ డెలివరీ రూ. 4305 దూసుకెళ్లి రూ. 65,528 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 66,164ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం!
కారణాలివీ..
ఇటీవల హ్యూస్టన్, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్, చైనా మధ్య చెలరేగిన వివాదాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ ఇండెక్స్ తాజాగా రెండేళ్ల కనిష్టం 94 డాలర్ల దిగువకు చేరింది. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి యూరోపియన్ దేశాల నేతలు 850 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి గత వారం ఆమోదముద్ర వేశారు. మరోవైపు ఈ వారంలో వాషింగ్టన్ ప్రభుత్వం సైతం కోవిడ్-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. నేటి నుంచి అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫెడ్ నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు సాధారణంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, సావరిన్ ఫండ్స్, ఈటీఎఫ్ పెట్టుబడులు తదితరాలు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపే విషయం విదితమే. ఇక సోలార్‌ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబిల్ తదితర పలురంగాల నుంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కోవిడ్-19 కారణంగా ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో వెండి ధరలకు రెక్కలొస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా 2021 ద్వితీయార్థానికల్లా వెండి ధరలు 30 డాలర్లను తాకవచ్చని తాజాగా అంచనా వేశారు.
ఈటీఎఫ్‌ల జోరు
సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగే సంగతి తెలిసిందే. ప్రస్తుత అనిశ్చిత పరిస్థతులలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సావరిన్ ఫండ్స్, ఈటీఎఫ్ తదితర ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు బంగారం కొనుగోలుకి ఎగబడుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈటీఎఫ్‌ల పసిడి హోల్డింగ్స్ 28 శాతం ఎగశాయి. అంటే 105 మిలియన్ ఔన్స్‌ల పసిడిని జమ చేసుకున్నాయి. ఫలితంగా 195 బిలియన్ డాలర్లకు వీటి విలువ చేరినట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి.
బుల్ ట్రెండ్‌లో
ప్రస్తుతం బంగారం బుల్ ట్రెండ్‌లో ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పసిడిలో బుల్ ట్రెండ్ 8-10ఏళ్లపాటు ఉంటుందని తెలియజేశాయి. గతంలో 2001-2011 మధ్య వచ్చిన బుల్ ట్రెండ్ కారణంగా పసిడి 1921 డాలర్ల వద్ద రికార్డ్ నెలకోల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అయితే తదుపరి బంగారం ధరలు 46 శాతం పతనంకావడంతోపాటు.. కొన్నేళ్లపాటు కన్సాలిడేట్ అయినట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం గోల్డ్‌లో నెలకొన్న స్పీడ్ ప్రకారం ఔన్స్ 3000 డాలర్లవరకూ దూసుకెళ్లవచ్చని యూఎస్ నిపుణులు నిగమ్ ఆరోరా ఒక నివేదికలో తాజాగా అంచనా వేశారు. ఇందుకు 50 శాతం అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు అరోరా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక జెఫరీస్ విశ్లేషకులు క్రిస్టోఫర్ ఉడ్ అయితే గత వారం ఔన్స్ పసిడి మరింత అధికంగా 4,000 డాలర్లను తాకవచ్చనంటూ అత్యంత ఆశావహంగా అంచనా వేసిన విషయం విదితమే.
స్వల్ప కాలంలో
ఇటీవల పసిడి వేగంగా బలపడటంతో సాంకేతికంగా ఓవర్‌బాట్ స్థాయికి చేరినట్లు బులియన్ విశ్లేషకులు అరోరా పేర్కొన్నారు. దీంతో సమీపకాలంలో భారీగా దిద్దుబాటుకు లోనుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వేగంగా పతనమైతే ఆ స్థాయిలో పసిడిని కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఇక నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా అక్టోబర్-నవంబర్ మధ్య ఔన్స్ పసిడి 2350 డాలర్లకు, వెండి 29.70 డాలర్లకు బలపడే వీలున్నదని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ణానశేఖర్ త్యాగరాజన్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment