గోల్డ్‌మన్ శాక్స్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూఎస్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మాదాపూర్‌లోని సలార్‌పురియా సత్వ నాలెజ్డ్ సిటీలో 1,59,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం నుంచి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, కంన్జ్యూమర్ బ్యాంకింగ్ సపోర్ట్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది పనిచేస్తున్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 800లకు చేరుతుందని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2023 చివరినాటికి హైదరాబాద్ కేంద్రంలో 2,500 మంది ఉద్యోగులు ఉంటారని వెల్లడించారు.
మహమ్మారిలోనూ పెట్టుబడులు..
కార్యాలయం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రభుత్వంతో గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ బృందం చర్చించింది. హైదరాబాద్ కార్యాలయానికి 500 మందిని నియమించుకుంటామని ఆ సందర్భంగా తమకు తెలిపారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘2023 నాటికి 2,500 మందిని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. ఇక్కడి మానవ వనరుల సామర్థ్యంపై కంపెనీకి ఉన్న నమ్మకానికి, మెరుగైన మౌలిక వసతులకు ఇది నిదర్శనం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే లక్ష్యానికి చేరుకోవడంతోపాటు కంపెనీ తదుపరి విస్తరణ చేపడుతుందన్న విశ్వాసం ఉంది. మహమ్మారిలోనూ పెట్టుబడులను ఆకర్శిస్తున్నాం. మరిన్ని కంపెనీలు రానున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో భాగ్యనగరిలో 1.8 లక్షల మంది పనిచేస్తున్నారు. వీ–హబ్‌తో కలిసి పనిచేయాల్సిందిగా గోల్డ్‌మన్ శాక్స్‌ను కోరుతున్నాను’ అని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment