న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల సారథ్యంలో నడిచే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంపై టెక్ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెట్టనుంది. 75 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే, 100 పైచిలుకు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్‌ను సపోర్ట్ చేసే వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. భారత పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు.
భారతీయ స్టార్టప్స్‌లో 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు, ఇందులో నాలుగో వంతు భాగం (సుమారు 75 మిలియన్ డాలర్లు) మహిళల సారథ్యంలోని ప్రారంభ దశ అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. భారీ స్థాయిలో విస్తరించిన టెక్నాలజీ .. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను స్పృశిస్తున్న నేపథ్యంలో నియంత్రణలనేవి బాధ్యతాయుతమైనవిగా, సమతూకం పాటించేవిగా ఉండాలని పిచాయ్ పేర్కొన్నారు.
ఎగుమతుల విషయంలో భారత్ అతి పెద్ద దేశంగా ఎదగగలదని ఆయన తెలిపారు. ఇంటర్నెట్‌ను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2020లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు)తో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లతో జియోలో 7.73 శాతం, భారతి ఎయిర్‌టెల్‌లో 700 మిలియన్ డాలర్లతో 1.2 శాతం వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది.
ప్రధాని, రాష్ట్రపతితో భేటీ ..
పర్యటన సందర్భంగా పిచాయ్ కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ‘మీ సారథ్యంలో భారత్ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం స్ఫూర్తిదాయకమైన విషయం‘ అని మోదీతో భేటీ అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. సమావేశంలో ఏయే అంశాలు చర్చించారనేది వెల్లడించలేదు.
అయితే, ‘గూగుల్ చిన్న వ్యాపారాలు .. స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం, సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం, విద్య..నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడం, వ్యవసాయం.. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేథను వినియోగిస్తుండటం వంటి అంశాల‘ పై ప్రధానితో చర్చించనున్నట్లు పిచాయ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అలాగే, స్పీచ్ టెక్నాలజీ, వాయిస్, వీడియో సెర్చ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు ప్రాజెక్టులను బ్లాగ్‌లో ప్రస్తావించారు. తాను భారత్‌లో పర్యటించిన ప్రతిసారి భారత స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుండటాన్ని గమనిస్తున్నానని ఆయన తెలిపారు.
గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా తమ అనువాదం, సెర్చ్ టెక్నాలజీ సేవలను మెరుగుపర్చుకునేందుకు దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో జట్టు కట్టినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఐఐటీ మద్రాస్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటు కోసం 1 మిలియన్ డాలర్ల గ్రాంటును అందించనున్నట్లుపేర్కొంది.వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాత టెక్నాలజీలపై పని చేసేందుకు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా వాధ్వానీ ఏఐకి 1 మిలియన్ గ్రాంటు అందిస్తున్నట్లు గూగుల్ వివరించింది.
‘మీతో నవకల్పనలు, టెక్నాలజీ వంటి ఎన్నో విషయాలను చర్చించడం సంతోషం కలిగించింది. మానవజాతి పురోగతికి, సుస్థిర అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించడంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’.
– ప్రధాని మోదీ ట్వీట్
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment