2024 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసారు. వీటితో పాటు ఉపాధి కల్పించే పథకాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న కారణంగా ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదు. ఉద్యోగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకం కింద.. వచ్చే రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏకంగా రూ.6000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని కింద ఐదు లక్షలకుపైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి.
ఈ కంపెనీలన్నీ సుమారు 10 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్వావలంబన భారత ఉపాధి పథకం అనేది కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని పెంపొందించడానికి ప్రవేశపెట్టారు. ఇది భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చేస్తుంది.
తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధిని కల్పించడానికి, ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళల వంటి రంగాలను విస్తరించవచ్చని సమాచారం. ఇందులో సరైన ఉపాధి లభిస్తే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment