జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోందన్న వార్తలు రాగానే భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే అందరి అంచనాలను మించిన ఐపీఓ ఇదే కానున్నదని సమాచారం. ఐపీఓ ద్వారా 10% వాటాను కేంద్రం విక్రయించగలదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఐపీఓ ద్వారా 25% వాటా విక్రయించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకేసారి 25 శాతాన్ని విక్రయిస్తారా, లేక 2–3 దఫాలుగా విక్రయిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు.
అయితే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి షేర్ ధరలో డిస్కౌంట్‌ను ఇవ్వాలని, బోనస్ షేర్లను కూడా జారీ చేయాలని ఒక ముసాయిదా కేబినెట్ నోట్ సిఫార్సు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల విభాగం ఇటీవలే ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను రూపొందించింది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికున్న 100% వాటాను 75%కి తగ్గించుకోవాలని, 25 శాతాన్ని దశలవారీగా విక్రయించాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. కరోనా కల్లోలంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. బడ్జెట్ లోటు మరింతగా పెరిగింది. ఈ సమస్యను ఎల్‌ఐసీ ఐపీఓతో అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ముసాయిదా కేబినెట్ నోట్‌లో ఏముందంటే...
► ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను ఆర్థిక శాఖ ఆధ్వర్వంలోని ఆర్థిక సేవల విభాగం రూపొందించింది. సంబంధిత కేంద్ర మంత్రులు, సెబీ, నీతి ఆయోగ్, ఐఆర్‌డీఏఐ పరిశీలన నిమిత్తం ఈ ముసాయిదాను తయారు చేసింది దీని ప్రకారం...
► ఎల్‌ఐసీలో ప్రభుత్వానికున్న వంద శాతం వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలనుకుంటున్న 25 శాతం వాటాను ఒకేసారి గానీ, దశలవారీ గానీ విక్రయించాలి.
► ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించిన ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇవ్వాలి.
► ఎల్‌ఐసీ లిస్టయిన తొలి రోజుల్లోనే బోనస్ షేర్లను జారీ చేయాలి.
► దీనికి సంబంధించి 1956 నాటి ఎల్‌ఐసీ చట్టంలో మొత్తం ఆరు సవరణలను చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదిస్తే రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎల్‌ఐసీ చట్ట సవరణల బిల్లును కేంద్ర ం తెచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్నందున దీన్ని ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనేది సర్కారు ప్రణాళిక.
10 శాతం డిస్కౌంట్!!
ఎల్‌ఐసీ ఐపీఓలో 10 శాతం వాటానే విక్రయించి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు దఫాల్లో మిగిలిన 15 శాతం మేర వాటాను విక్రయించే అవకాశాలే అధికంగా ఉన్నాయని నిపుణులంటున్నారు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత కనీస ప్రజా వాటాను మూడేళ్లలో 25 శాతం మేర తగ్గించుకోవాలన్న సెబీ నిర్ణయమే దీనికి ఆధారమని వారంటున్నారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇష్యూ ధరలో 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులకు కూడా ఈ డిస్కౌంట్ లభించవచ్చు.
బోనస్ షేర్ల బొనంజా...!
ఎల్‌ఐసీ చెల్లించిన మూలధనం రూ.100 కోట్లు. ఇంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న మూలధనం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే బోనస్ షేర్లు జారీ చేయడం ద్వారా కంపెనీ రిజర్వ్‌లను పాక్షికంగానైనా మూలధనంగా మార్చుకునే వీలు కలుగుతుందని, ఆ విధంగా చెల్లించిన మూలధనం పునర్వ్యస్థీకరించుకునే వీలు కలుగుతుందని ప్రభుత్వ ఆలోచన. బోనస్ షేర్లను జారీ చేయడం వల్ల రిజర్వ్(మిగులు నిధుల)ను మూలధనంగా మార్చుకునే వెసులుబాటుతో పాటు, రిటైల్ ఇన్వెస్టర్లను ఇట్టే ఆకర్షించవచ్చు కూడా !
ఐపీఓ సైజు ఎంత?
ఎల్‌ఐసీ సంస్థ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని ఒక అంచనా. 10% వాటా విక్రయం ప్రకారం.. ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్‌లో ఉండొచ్చనేది గత అంచనా. తాజా వార్తల ప్రకారం ఇష్యూ సైజు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment