న్యూఢిల్లీ: అక్రమ వాణిజ్యం కారణంగా పెద్ద ఎత్తున పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వాణిజ్యం కారణంగా రూ.58,521 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్టు వాణిజ్య మండలి ఫిక్కీ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎఫ్‌ఎంసీజీ, మొబైల్ ఫోన్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం రంగాల్లో అక్రమ వాణిజ్యాన్ని ప్రస్తావించింది. ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం 2019–20లో రూ.2.60 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ఇందులో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల టర్నోవర్ 75 శాతంగా ఉంటుందని తెలిపింది.
అక్రమ వాణిజ్యం కారణంగా ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజ్డ్ పరిశ్రమలో రూ.17,074 కోట్లు, ఆల్కహాల్ ఉత్పత్తుల వల్ల రూ.15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.13,331 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ విభాగంలో రూ.9,995 కోట్లు, మొబైల్ ఫోన్లలో రూ.2,859 కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. ‘అక్రమ మార్కెట్లు.. జాతి ప్రయోజనాలకు విరుద్ధం’ పేరుతో ఫిక్కీ ఈ నివేదికను తీసుకొచ్చింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తుల రూపంలో ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం వస్తుంటుంది. వీటిపై నియంత్రణలు కూడా ఎక్కువే కావడం గమనార్హం. అక్రమ వాణిజ్యం వల్ల ఖజానాకు కలిగిన నష్టంలో సగం పొగాకు, మద్యం ఉత్పత్తుల నుంచే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
ఉపాధికీ నష్టమే..
ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలో అక్రమ వాణిజ్యం కారణంగా 7.94 లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లింది. పొగాకు పరిశ్రమలో 3.7 లక్షల మంది, ఎఫ్‌ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ పరిశ్రమలో 2.98 లక్షల మంది, ఆల్కహాల్ బెవరేజెస్‌లో 97,000 మంది, మొబైల్ ఫోన్ పరిశ్రమలో 35,000 మంది అక్రమ వాణిజ్యం కారణంగా ఉపాధి కోల్పోయారు. ‘‘ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలతో ఈ రంగాలకు అనుబంధం ఉండడం వల్లే’’అని ఫిక్కీ నివేదిక వివరించింది. తయారీని బలోపేతం చేయడం, అసలైన ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్–సరఫరా మధ్య అంతరం లేకుండా చూడడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, పన్ను టారిఫ్‌ల క్రమబద్ధీకరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం.. అక్రమ వాణిజ్య నిరోధానికి అవసరమని ఫిక్కీ నివేదిక సూచించింది.
చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!
Comments
Please login to add a commentAdd a comment