న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 56 శాతం జంప్‌చేసి రూ. 4,070 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,617 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 28,811 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 23 శాతం అధికమై రూ. 25,786 కోట్లను దాటాయి. వాటాదారులకు రూ. 5 ప్రత్యేక డివిడెండుతో కలిపి షేరుకి మొత్తం రూ. 10 చొప్పున చెల్లించనుంది.
పూర్తి ఏడాదికి
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి గ్రాసిమ్ నికర లాభం 60 శాతం దూసుకెళ్లి రూ. 11,206 కోట్లను అధిగమించింది. 2020–21లో కేవలం రూ. 6,987 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు 25 శాతంపైగా వృద్ధితో రూ. 76,404 కోట్లను తాకాయి. కాగా.. క్యూ4 ఆదాయంలో విస్కోస్ పల్ప్, స్టేపుల్ ఫైబర్, ఫిలమెంట్ యార్న్ విభాగం వాటా 46 శాతం ఎగసి రూ. 3,766 కోట్లకు చేరింది.
సిమెంట్ రంగ అనుబంధ సంస్థ అల్ట్రాటెక్ టర్నోవర్ 9 శాతం పుంజుకుని రూ. 15,767 కోట్లను దాటింది. కెమికల్స్ విభాగం నుంచి 69 శాతం అధికంగా రూ. 2,487 కోట్లు సమకూరింది. ఫైనాన్షియల్ సర్వీసుల ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 6,622 కోట్లయ్యింది. ఇతర విభాగాల ఆదాయం 29 శాతం బలపడి రూ. 705 కోట్లను తాకింది.
ఫలితాల నేపథ్యంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్‌ఈలో దాదాపు 4 శాతం నష్టంతో రూ. 1,403 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment