జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్‌లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్‌టీ పెంచినట్లు అధికారి తెలిపారు.
బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.
20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.
ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్‌లపై కూడా జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.
ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్‌టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్‌లు, హెయిర్ కర్లర్‌లపై ఉన్న జీఎస్‌టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.
జీఎస్‌టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్‌టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్‌టీలో మినహాయింపు ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment