సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆమెకున్న అకౌంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అప్పలనర్సమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున వినోద్‌కుమార్ దేశ్‌పాండే, సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.నాగేందర్ వాదనలు వినిపించారు. అప్పలనర్సమ్మ కుమారులపై కేసు నమోదు చేసినప్పుడు బంధువులతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలనూ ఫ్రీజ్ చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే సీబీఐ చార్జీషీట్‌లో ఆమె పేరు ఎక్కడా లేదని, నిందితులకు ఆర్థిక నేరాల కింద శిక్ష కూడా విధించారని చెప్పారు. పిటిషనర్ 85 ఏళ్ల వృద్ధురాలని, రోజు వారీ అవసరాలకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
అనంతరం నాగేందర్ వాదనలు వినిపిస్తూ.. రామలింగరాజు ఆర్థిక నేరాలతో పిటిషనర్ కూడా లబ్ధి పొందారన్నారు. 1999 నుంచి 2001 వరకు ఆమె పేరుపై 3,92,500 షేర్లు ఉన్నాయన్నారు. నేరాలు మోపబడిన కంపెనీలో ఆమె డైరెక్టర్‌గానీ, ప్రమోటర్‌గానీ కాకపోవడంతో చార్జీషీట్‌లో పేరు చేర్చలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించారు. వారెవ్వా (క్లిక్: హైదరాబాద్.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment