సాక్షి, ముంబై: టెక్ మేజర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్) తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. అంచనాలకు మించిన త్రైమాసిక లాభాలను సాధించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల మంది ఉద్యోగులకు భారీ ప్రత్యేక బోనస్ బొనాంజా ప్రకటించింది. సుమారు 700 కోట్ల రూపాయల విలువైన వన్‌టైమ్ స్పెషల్ బోనస్‌ను అందిస్తున్నట్టు వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా తమ ప్రతీ ఉద్యోగి అపారమైన నిబద్ధతతో సేవలందించారని ఇదే సంస్థ వృద్ధికి దోహదపడిందని సంస్థ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులే తమకు అత్యంత విలువైన ఆస్తి అని కంపెనీ ప్రకటించడం విశేషం.
2020 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తరువాత హెచ్‌సీఎల్ ఈ బంపర్‌ఆఫర్ ప్రకటించింది. సుమారు 90 మిలియన్ డాలర్లు (రూ. 650 కోట్లకు పైగా) ప్రత్యేక బోనస్‌ను ఫిబ్రవరిలో ఉద్యోగులకు చెల్లించనుంది. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్ అందుతుందని, ఇది పది రోజుల జీతానికి సమానమని హెచ్‌సీఎల్ టెక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థలోని ప్రతీ ఉద్యోగికి హెచ్‌సీఎల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2020 డిసెంబర్ త్రైమాసికంలో సంవత్సరానికి నికర లాభం 31.1 శాతం ఎగిసి 3,982 కోట్ల రూపాయలుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన, హెచ్‌సిఎల్ లాభం 26.7 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ .4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment