
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లు 20 సెప్టెంబర్ 2021 నుంచి 6.70 శాతానికి హెచ్‌డీఎఫ్‌సీ అందించే గృహ రుణాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
రుణ మొత్తం లేదా ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 31 అక్టోబర్ 2021 వరకు అందుబాటులో ఉండనున్నట్లు రుణదాత తెలిపింది. గతంలో ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.(చదవండి: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్!)
Comments
Please login to add a commentAdd a comment