Here Is The Most Interesting And Weird Jobs In The World - Sakshi
Sakshi News home page

ఇలాంటి వింత ఉద్యోగాల గురించి ఎప్పుడైనా విన్నారా

Published Sun, Nov 6 2022 10:57 AM | Last Updated on Sun, Nov 6 2022 12:41 PM

Here Is The Most Interesting And Weird Jobs In The World - Sakshi

మనుషుల మనుగడకు ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం– ఇలా ఏదో ఒక ఆదాయ మార్గం ఉండాల్సిందే! కొన్ని పనుల్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఇంకొన్ని పనుల్లో పెద్దగా కష్టం లేకున్నా, ఫలితం బాగానే దక్కుతుంది. ఆదాయమార్గమైన ఏ రంగంలో రాణించాలన్నా, ఆ రంగానికి చెందిన నైపుణ్యాలు లేకుంటే, అందులో కొనసాగడం కష్టమే! రకరకాల చదువులు, శిక్షణలు వంటివన్నీ ఉపాధి కోసమే! ఉపాధి ఏదైనా, అందులోని కష్టనష్టాలను భరించక తప్పదు. డబ్బులు ఊరికే రావు కదా మరి! నిజమే గాని, పూర్తిగా ఊరికే కాకున్నా దాదాపు ఊరికే డబ్బులొచ్చే ఉపాధి మార్గాలూ ఉన్నాయి. ప్రపంచంలో దండిగా ఆదాయం తెచ్చిపెట్టగల కొన్ని సుఖప్రదమైన సరదా పనులు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని చిత్రవిచిత్రమైన ఉపాధి మార్గాలు కూడా ఉన్నాయి. అతి అరుదైన అలాంటి కొన్ని వింత వింత ఉద్యోగాలు, ఉపాధిమార్గాల విశేషాలు మీకోసం..

రోజూ భోంచేయడం, భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను రుచిచూడటం, రోజంతా అలసి సొలసి పనిచేశాక, రాత్రివేళ ఆదమరచి నిద్రపోవడం, కాలక్షేపానికి సినిమాలు చూడటం, టీవీ చానళ్లు, ఓటీటీల్లోని ప్రసారాలను చూడటం వంటివి అందరూ చేసే పనులే! ఈ పనుల వల్ల ఎంతో కొంత ఖర్చు కూడా తప్పదు. అయితే, కొందరికి మాత్రం ఇలాంటి పనులే భేషైన ఆదాయమార్గాలుగా మారి, ఇబ్బడిముబ్బడిగా కాసులు కురిపిస్తున్నాయి. ఏమిటేమిటి? తిండి తిన్నా, నిద్రపోయినా, సినిమాలు చూసినా డబ్బులిస్తారా? అని అవాక్కయిపోకండి. ఇలాంటి రోజువారీ పనులకూ భేషుగ్గా డబ్బులిచ్చేవారు ఉన్నారు. 

ప్రొఫెషనల్‌ స్లీపర్‌
చక్కని సుతిమెత్తని పరుపు మీదకు చేరి, సుఖంగా నిద్రించడమే ప్రొఫెషనల్‌ స్లీపర్‌ పని. పాశ్చాత్య దేశాల్లో కొన్ని పరుపుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి ప్రొఫెషనల్‌ స్లీపర్లకు పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నిద్రకు సంబంధించిన సమస్యలపై వైద్య పరిశోధనల కోసం కొన్ని ఔషధ తయారీ సంస్థలు, భారీ స్థాయి ప్రదర్శనలను ఏర్పాటు చేసేచోట ప్రదర్శనల నిర్వాహకులు కూడా ప్రొఫెషనల్‌ స్లీపర్ల సేవలను తమ అవసరాల మేరకు తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. వీరు చేయాల్సిన పనల్లా, తమకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో, పరిసరాల్లో చక్కగా నిద్రించడం, నిద్ర లేచాక తమ నిద్రానుభూతిని వివరంగా తెలియజేయడం. ప్రొఫెషనల్‌ స్లీపర్ల సగటు వార్షిక ఆదాయం 46,545 డాలర్ల (రూ.38.36 లక్షలు) వరకు ఉంటుంది.

పెట్‌ఫుడ్‌ టెస్టర్‌
ఫుడ్‌ టెస్టర్‌ మరీ అరుదైన ఉద్యోగమేమీ కాదు. కొన్ని స్టార్‌ హోటళ్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్‌ టెస్టర్లను నియమించుకుంటాయి. అయితే, పెంపుడు జంతువుల కోసం తయారు చేసే ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యత ఎలా ఉన్నదీ చెప్పడానికి కొన్ని బహుళజాతి పెట్‌ఫుడ్‌ తయారీ సంస్థలు ఫుడ్‌ టెస్టర్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పెంపుడు పిల్లులు, కుక్కల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యతను చెప్పడమే పెట్‌ఫుడ్‌ టెస్టర్ల పని. ఈ ఉద్యగంలో ఏడాదికి 27 వేల డాలర్లకు (22.25 లక్షలు) పైగానే సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. 

పారానార్మల్‌ గైడ్‌
ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశాల్లో అక్కడి స్థానిక విశేషాలను పర్యాటకులకు వివరించేందుకు గైడ్లు ఉంటారు. ఈ పని వారికి ఒక స్వయం ఉపాధి మార్గం. ప్రపంచంలో భయానక ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు అక్కడ తిరుగుతుంటాయని ఆ ప్రదేశాల గురించిన కథలు వినిపిస్తుంటాయి. చాలామంది అలాంటి ప్రదేశాలకు వెళ్లడానికే భయపడతారు. కొందరికి మాత్రం అతీంద్రియ శక్తుల విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలాంటి ఔత్సాహికులు వెదికి మరీ అలాంటి ప్రదేశాలకు వెళుతుంటారు. సాహసించి వెళ్లిన వారికి అక్కడి స్థానిక విశేషాలు, పద్ధతులు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సహకరించేందుకే పారానార్మల్‌ గైడ్లు పుట్టుకొచ్చారు. పర్యాటకులకు తోడుగా అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకునే పాడుబడ్డ బంగ్లాలు, కోటలు, అడవుల్లోకి వెళుతూ, వారికి అక్కడి విశేషాలను వివరిస్తారు. వీరి ఆదాయం ఏడాదికి 84 వేల డాలర్ల (రూ.69.27 లక్షలు) వరకు ఉంటుంది.

ఫార్చూన్‌కుకీ రైటర్‌
కుకీస్‌ చాలామందికి ఇష్టమైన చిరుతిండి. వీటిలో రకరకాలు ఉంటాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా కుకీస్‌ను ఇష్టంగా తింటారు. పాశ్చాత్యదేశాల్లో కుకీస్‌ను తయారు చేసే కొన్ని కంపెనీలు, వాటిలో కొన్ని చీటీలను పెడతాయి. ఆ చీటీల్లో అదృష్టాన్ని సూచించే అందమైన వాక్యాలు ఉంటాయి. జనాలను బాగా ఆకట్టుకునేలాంటి అదృష్ట వాక్యాలు రాయడంలో నైపుణ్యం ఉన్న రచయితలను కుకీల తయారీ సంస్థలు ఫార్చూన్‌ కుకీ రైటర్లుగా నియమించుకుంటాయి. చాలామంది కుకీల కంటే, వాటిలో ఉండే చీటీల కోసమే వాటిని కొంటుంటారు. అందువల్ల ఫార్చూన్‌కుకీ రైటర్లకు గిరాకీ ఏర్పడింది. వీరి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది.

ఫేస్‌ఫీలర్‌
రకరకాల ముఖాలను చేతులతో తాకి, ముఖచర్మాల తీరుతెన్నులను వివరించడమే ‘ఫేస్‌ఫీలర్‌’ పని. సౌందర్యసాధనాల మార్కెట్‌లో ముఖానికి సంబంధించిన వాటి వాటానే సింహభాగం ఉంటుంది. అందువల్ల ముఖసౌందర్యానికి మెరుగుపరచే క్రీములు, లోషన్లు, పౌడర్లు, సబ్బులు, ఫేస్‌వాష్‌లు, షేవింగ్‌ క్రీములు, రేజర్లు వంటివి తయారు చేసే సంస్థలు ప్రత్యేకంగా ఫేస్‌ ఫీలర్లను నియమించుకుంటాయి. కొత్తగా ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చే ముందు ఈ కంపెనీలు రకరకాల పరీక్షలు నిర్వహిస్తాయి. వాటిలో ఫేస్‌ఫీలర్ల పాత్ర కీలకం. ఉత్పత్తులు వాడక ముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు ముఖచర్మాల్లో వచ్చిన మార్పులను చేతులతో తాకి గుర్తించి, వివరాలను నమోదు చేయడం వీరి ముఖ్యమైన పని. వీరు భరోసా ఇస్తేనే, సదరు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. వీరి పారితోషికం గంటకు 25–50 డాలర్ల (రూ.2,061–4,123)వరకు ఉంటుంది. 

లైన్‌ స్టాండర్‌
క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి రావడం ఎవరికైనా ఇబ్బందే! బలహీనంగా ఉన్నవాళ్లయితే క్యూలైన్లలో నిలబడలేక, సొమ్మసిల్లిపోయే సంఘటనలు మనకు తెలియనివి కాదు. మనవంతు క్యూలైన్‌లో మనకు బదులు మరొకరు నిలబడేందుకు ముందుకొస్తే, ఎంతో ఉపశమనంగా ఉంటుంది. క్యూలైన్ల సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. జనాలు ఎదుర్కొనే ఈ ఇబ్బందిని గమనించి కొందరు, దీనినే తమ స్వయం ఉపాధి అవకాశంగా మార్చుకున్నారు. ఇతరుల బదులు క్యూలైన్‌లో నిలబడి, అందుకు కొంత రుసుము తీసుకుంటారు. ఈ పనిచేయడానికి విద్యార్హతలు, నైపుణ్యాలతో పెద్దగా పనిలేదు. కాళ్లల్లో సత్తా, గంటల తరబడి నిలబడే ఓపిక ఉంటే చాలు. అమెరికాలోను, యూరోపియన్‌ దేశాల్లోనూ కొద్దిమంది లైన్‌స్టాండర్లుగా ఉపాధి పొందుతున్నారు. షాపింగ్‌ మాల్స్‌ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించినప్పుడు, బడా కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు వీరికి బాగా గిరాకీ ఉంటుంది. లైన్‌స్టాండర్లు ఈ పని ద్వారా వారానికి వెయ్యి డాలర్ల వరకు (సుమారు రూ.82 వేలు) సంపాదిస్తుంటారు. 

పెయింట్‌ డ్రై వాచర్‌
పెయింట్లను తయారు చేసే కొన్ని బడా అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించేందుకు పెయింట్‌ డ్రై వాచర్లను నియమించుకుంటాయి. పెయింటర్లు గోడలకు పెయింట్‌ పూయడం పూర్తిచేసిన వెంటనే పెయింట్‌ డ్రై వాచర్ల పని మొదలవుతుంది. గంటల తరబడి పెయింట్‌ పూసిన గోడ ముందే కూర్చుని, పూసిన పెయింట్‌ ఆరడానికి ఎంత సమయం పడుతోంది, ఆరిన తర్వాత దేనికైనా అంటుకుంటోందా లేదా అని పరిశీలించి, ఆ వివరాలను కంపెనీ నిర్వాహకులకు ఒక నివేదికలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ పనిచేయడానికి కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చునే ఓపిక ఉంటే చాలు. ఈ పనిచేసే వారికి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది. 

ఇలాంటివే మరికొన్ని...
ఇలాంటివే మరికొన్ని విచిత్రమైన ఉద్యోగాలు, వృత్తులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని రిస్కుతో కూడుకున్నవీ ఉన్నాయి. ఉదాహరణకు పాముల నుంచి విషాన్ని వెలికితీయడం. ఈ ప్రక్రియను స్నేక్‌ మిల్కింగ్‌ అంటారు. ఔషధ కంపెనీలు ఈ పనికోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటాయి. వీరికి వార్షికాదాయం 60 వేల డాలర్ల (సుమారు 50 లక్షలు) వరకు ఉంటుంది. వివాహ వేడుకల్లో అతిథుల సందడి తక్కువయ్యే సందర్భాల్లో కొందరు ఫేక్‌గెస్ట్‌లను ఆహ్వానిస్తుంటారు. ఒక్కో పెళ్లికి హాజరయ్యేందుకు వీరికి 2500 డాలర్ల (రూ.2.06 లక్షలు) వరకు  ముడుతుంది. అలాగే అంతిమయాత్రలో పాల్గొనేందుకు కూడా అద్దెమనుషుల సేవలను ఉపయోగించుకునే జనాలూ ఉన్నారు. విమానాలకు రంగులు వేసే ఏరోప్లేన్‌ పెయింటర్, వ్యాపార సమావేశాలకు కాస్త హంగు తీసుకొచ్చే ప్రొఫెషనల్‌ ఫారెనర్, రహదారికి అడ్డంగా పేరుకుపోయిన మంచుదిమ్మలను తొలగించే ఐస్‌బెర్గ్‌ మూవర్, ఎలుకల సాయంతో మందుపాతరల ఆచూకీని కనుగొనే ల్యాండ్‌మైన్‌ డిటెక్టర్, దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించే తీఫ్‌ హంటర్‌ వంటి అరుదైన వృత్తులు కూడా ఉన్నాయి. ఈ వృత్తులు, ఉద్యోగాల గురించి చాలామందికి సరైన సమాచారం తెలియదు. ఇలాంటి కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల ఆదాయం కంటే ఎక్కువగానే ఉండటం విశేషం.

ఫెంగ్‌షుయి కన్సల్టంట్‌
ఫెంగ్‌షుయి ప్రాచీనకాలం నుంచి చైనాలో వ్యాప్తిలో ఉంది. ఇది దాదాపు మన వాస్తుశాస్త్రంలాంటిది. చైనా నుంచి ఇది దేశదేశాలకూ పాకింది. అగ్రరాజ్యాల్లో ఫెంగ్‌షుయికి ఆదరణ విపరీతంగా ఉంటోంది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ చైనీయులు కొందరు ఫెంగ్‌షుయిని వృత్తిగా మలచుకుని భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. ఫెంగ్‌షుయి పూర్తిగా విశ్వాసాలతో కూడుకున్నదే అయినా, దీని గిరాకీ తక్కువేమీ కాదు. ఈ గిరాకీనే ఫెంగ్‌షుయి కన్సల్టంట్లకు కాసుల పంట పండిస్తోంది. ఒక్కో క్లయింట్‌ నుంచి వీరు వెయ్యి డాలర్ల (రూ.82 వేలు) వరకు వసూలు చేస్తుంటారు.

పేపర్‌ టవల్‌ స్నిఫర్‌
సెంట్లు, డియోడరెంట్లు వంటివి వాసన చూసి, వాటి నాణ్యతను పరీక్షించే ఆడర్‌ స్నిఫర్లే కాదు, పేపర్‌ టవల్స్‌– అదే టిష్యూపేపర్లను వాసన చూసే పేపర్‌ టవల్‌ స్నిఫర్లూ ఉన్నారు. టిష్యూపేపర్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు పేపర్‌ టవల్‌ స్నిఫర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అప్పుడే తయారైన టిష్యూ పేపర్లను వాసన చూసి, వాటి నాణ్యతను ధ్రువీకరించడమే వీరు చేయాల్సిన పని. వీరికి ఏడాదికి 52 వేల డాలర్ల (రూ.42.88 లక్షలు) వరకు ఆదాయం ఉంటుంది. 

హ్యూమన్‌ స్టాచ్యూ
హ్యూమన్‌ స్టాచ్యూలు మన దేశంలోనూ కనిపిస్తారు. అయితే, వారినెవరూ ప్రత్యేకంగా నియమించరు. వారంతట వారే, ఒళ్లంతా తెల్లగా మెరిసే రంగు పూసుకుని గాంధీ వేషంలో ఎక్కువగా రద్దీ కూడళ్లలో కనిపిస్తుంటారు. జనాలు జాలి తలచి ఇచ్చే డబ్బు తప్ప వారికి దక్కేదింకేమీ ఉండదు. కాని, పాశ్చాత్య దేశాల్లోనైతే ఇదొక ప్రత్యేకమైన వృత్తి. వీరు ఒంటికి రంగు పూసుకుని, కదలకుండా శిలా విగ్రహంలా గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. ఎక్కువగా వేడుకలు జరిగే చోట, షాపింగ్‌ మాల్స్‌ వద్ద జనాలను ఆకట్టుకోవడానికి వీరిని నియమించుకుంటారు. వీరి సేవలకు గంటకు 100 డాలర్ల (సుమారు రూ.8,200) వరకు పారితోషికంగా చెల్లిస్తారు.

ఆడర్‌ స్నిఫర్స్‌
పొద్దన్న లేచింది మొదలు రకరకాల వాసనలను ఆఘ్రాణిస్తూనే ఉంటాం. వాసనలు చూడటానికి జీతాలు చెల్లించే సంస్థలూ ఉన్నాయి. సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లు, డీయోడరెంట్లు వంటి పరిమళ ద్రవ్యాలను తయారు చేసే కొన్ని పెద్దస్థాయి కంపెనీలు ప్రత్యేకంగా ఆడర్‌ స్నిఫర్స్‌ను నియమించుకుంటాయి. ఇంకొన్ని కంపెనీలు తమ అవసరం మేరకు గంటకు కొంతమొత్తం చొప్పున పారితోషికం చెల్లించి, ఆడర్‌ స్నిఫర్ల సేవలను వినియోగించు కుంటాయి. ఉత్పత్తుల నాణ్యతను కాపాడుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్తదనాన్ని అందించడానికి మార్కెట్‌లో పోటీ పడే సంస్థలు నిశితమైన ఆఘ్రాణశక్తి గలవారికి ఆడర్‌ స్నిఫర్లుగా అవకాశాలు ఇస్తుంటాయి. ఈ ఉద్యోగంలో పనితనం, అనుభవం బట్టి ఏడాదికి 39 వేల (32.16 లక్షలు) నుంచి, 1.13 లక్షల డాలర్ల (రూ.93.18 లక్షలు) వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా వీరి సేవలను వినియోగించు కునే కంపెనీలు వీరికి గంటకు 25–30 డాలర్ల (రూ.2,061– 2,474) వరకు చెల్లిస్తాయి.

ప్రొఫెషనల్‌ కడ్లర్‌
ఇది పూర్తిగా స్వయం ఉపాధి వృత్తి. తమ వద్దకు వచ్చే క్లయింట్లను వాటేసుకోవడమే వీరి పని. రకరకాల కారణాలతో దిగులు, మనోవేదనతో బాధపడేవారు ఆత్మీయస్పర్శను కోరుకుంటారు. ఆత్మీయస్పర్శకు నోచుకోని ఒంటరిజీవులకు ఊరటనిచ్చే ఉద్దేశంతో సమంతా హెస్‌ అనే అమెరికన్‌ యువతి దాదాపు దశాబ్దం కిందట ప్రొఫెషనల్‌ కడ్లర్‌గా మారింది. ఆమె ఇందులో విజయవంతం కావడంతో మరికొందరు కూడా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. సోఫాపై కూర్చుని లేదా మంచంపై పడుకుని, క్లయింట్లను కౌగలించుకుని ఉండటమే వీరి పని. వీరి ఆదాయం గంటకు 20 నుంచి 40 డాలర్ల (రూ.1650– 3300) వరకు ఉంటుంది.

మూవీ వాచర్‌
సినిమాలు చూడటమంటే చాలామందికి సరదా. అభిమాన హీరోల సినిమాలు విడుదలైతే, థియేటర్లో ఆడుతున్నన్ని రోజులూ వాటిని చూసే వీరాభిమానులూ ఉంటారు. సినిమాకు వెళితే టికెట్లు, వెహికల్‌ పార్కింగ్, చిరుతిళ్లు, కూల్‌డ్రింకులు వగైరాలకు బాగానే ఖర్చవుతుంది. అయితే, సినిమాలు చూడటానికి– అదీ విడుదలకు ముందే వాటిని చూడటానికి డబ్బులిచ్చేవారూ ఉన్నారు. హాలీవుడ్‌లో కొన్ని నిర్మాణ సంస్థలు తాము నిర్మించిన సినిమాలు చూసి, వాటికి రేటింగ్‌ ఇచ్చేందుకు నిపుణులైన విశ్లేషకులను నియమించుకుంటాయి. ‘నెట్‌ఫ్లిక్స్‌’ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలూ ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్నాయి. విడుదలకు ముందే ఈ నిపుణులు సినిమాలు, సిరీస్‌లు చూసి, వాటికి మంచి రేటింగ్‌ ఇస్తేనే, అవి విడుదలకు నోచుకుంటాయి. ఈ పని చేసేవారికి గంటకు 15 డాలర్ల (రూ.1237) వరకు పారితోషికం ఉంటుంది.

ప్రొఫెషనల్‌ మెర్‌మెయిడ్‌
మెర్‌మెయిడ్లు– అంటే మత్స్యకన్యలు కాల్పనిక సాహిత్యంలో తప్ప నిజజీవితంలో కనిపించరు. అయితే, కొందరు మెర్‌మెయిడ్‌ వేషధారణతో సరదాగా సముద్రతీరంలోనో, కనీసం ఈతకొలను దగ్గరో రకరకాల భంగిమల్లో ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. నడుము నుంచి దిగువభాగమంతా చేప మాదిరిగా తయారు చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఈతకొడుతూ చూసేవారిని ఆకర్షిస్తూ ఉంటారు. పెద్దపెద్ద వేడుకలు, ఉత్సవాలు జరిగేచోట నిర్వాహకులు ప్రొఫెషనల్‌ మెర్‌మెయిడ్ల సేవలను ఉపయోగించుకుంటూ ఉంటారు. సందర్శకుల్లో ఆసక్తి ఉన్నవారికి మెర్‌మెయిడ్‌ దుస్తులు ధరించి, ఈతకొట్టడంలో మెలకువలను కూడా వీరు నేర్పిస్తూ ఉంటారు. ఇది పూర్తిస్థాయి ఉద్యోగం కాకున్నా, భారీగానే ఆదాయం తెచ్చిపెట్టే స్వయం ఉపాధి మార్గం. ప్రొఫెషనల్‌ మెర్‌మెయిడ్లకు ఆదాయం గంటకు 300 డాలర్ల (సుమారు రూ.25 వేలు) వరకు ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement