న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి.
ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు.
చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment