అర్థం లేని చర్యగా కొట్టిపారేసిన హిండెన్‌బర్గ్
అవినీతిని బైటపెట్టేవారిని భయపెట్టే యత్నమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: అకౌంటింగ్‌లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్‌సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది.
కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్‌డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment