న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 8 శాతం పెరిగాయి. కానీ, విడిగా చూస్తే హైదరాబాద్ సహా ఐదు మార్కెట్లలో అమ్మకాలు పడిపోగా, కేవలం మూడు పట్టణాల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో మొత్తంమీద ఎనిమిది మార్కెట్లలో కలసి అమ్మకాలు 8 శాతం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 3 శాతం తగ్గాయి.
ఈ వివరాలను ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ ఎనిమిది పెద్ద పట్టణాల్లో ఏప్రిల్–జూన్ కాలంలో 80,250 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 74,320 యూనిట్లుగా ఉన్నాయి. ‘రియల్ ఇన్‌సైట్ రెసిడెన్షియల్ ఏప్రిల్–జూన్ 2023’ నివేదికను ప్రాప్‌టైగర్ బుధవారం విడుదల చేసింది. ప్రధానంగా ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో ఇళ్ల విక్రయాలు పెరగ్గా, హైదరాబాద్‌తోపాటు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో తగ్గాయి.
ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కొనుగోళ్ల పరంగా బలమైన సానుకూల సెంటిమెంట్‌కు దారితీసిందని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ప్రాప్‌టైగర్, హసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ ఇవన్నీ కూడా ఆర్‌ఈఏ ఇండియా కిందే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల అమ్మకాల వృద్ధికి కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం ఇవన్నీ కారణాలుగా ప్రాప్‌టైగర్ నివేదిక వివరించింది.
పట్టణాల వారీగా విక్రయాలు..
► హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 7,680 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 7,910 యూనిట్లతో పోలిస్తే 3 శాతం తక్కువగా నమోదయ్యాయి.
► అహ్మదాబాద్ మార్కెట్లో అమ్మకాలు 17 శాతం పెరిగి 8,450 యూనిట్లుగా ఉన్నాయి.
► బెంగళూరులో విక్రయాల పరంగా 19 శాతం క్షీణత కనిపించింది. 6,790 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు.
► చెన్నైలో అమ్మకాలు 5 శాతం తగ్గి 3,050 యూనిట్లుగా ఉన్నాయి.
► కోల్‌కతాలో 40 శాతం తగ్గి 1,940 యూనిట్లు అమ్ముడయ్యాయి.
► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 16 శాతం వృద్ధితో 30,260 యూనిట్లకు చేరాయి.
► పుణెలోనూ 37 శాతం అధికంగా 18,850 యూనిట్లు అమ్ముడుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment