
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది.
డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్‌ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు.
ఆచితూచి పెట్టుబడులు..
డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్‌మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్‌ఆర్‌పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్‌ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment