తొలి 3 నెలల్లో 1.30 లక్షల యూనిట్ల విక్రయాలు
హైదరాబాద్‌లో 38% వృద్ధి
అనరాక్ గణాంకాల వెల్లడి
ముంబై: బలమైన డిమాండ్ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం(ఎంఎంఆర్), పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కత్తా నగరాల్లో క్షీణించాయి.
► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.
‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment