ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లలో, భూములు, బంగారం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతారు. అయితే, స్టాక్ మార్కెట్లలో రాబడి అనేది చాలా స్థిరంగా ఉండదు. ఇక భూములపై పెట్టె పెట్టుబడులు వల్ల మంచి ఆదాయం వచ్చిన అందులో చాలా తలనొప్పులు ఉంటాయి. ఇక బంగారం మిగతా రెండింటితో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉన్న స్థిరమైన రాబడి వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది బంగారాన్ని ఒక ఆభరణాలుగా మాత్రమే చూడకుండా దానిని ఒక పెట్టుబడిగా చూస్తారు.
అందుకే, పెట్టుబడిదారులు బంగారాన్ని స్వర్గధామంగా భావించి పసిడికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. భౌతిక బంగారం అనేది బంగారం పురాతన రూపం. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక కొత్త మార్గాలు వచ్చాయి. డిజిటల్ బంగారం, భౌతిక బంగారం, పేపర్ బంగారం వంటివి ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని బంగారు పెట్టుబడుల రకాలు. ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భౌతిక బంగారం మీదనే కాకుండా మిగతా వాటి మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. (చదవండి: రూ. 100కే గోల్డ్..! సరికొత్త వ్యూహంతో గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీలు..!)
బంగారం పెట్టుబడుల రకాలు:
- భౌతిక బంగారం: బంగారు ఆభరణాలు, నాణేలు, బార్లు మొదలైనవి
- డిజిటల్ బంగారం: పేటిఎమ్, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారం
- పేపర్ బంగారం: గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి
వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాలలో పెట్టుబడి పెడతారు. అయితే, వివిధ రకాల బంగారంపై వివిధ రకాల పన్నులు విధించబడతాయి. భౌతిక బంగారంపైనా, గోల్డ్ బాండ్లపైనా ఒకేరకంగా పన్ను ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టడానికి ముందు వివిధ బంగారు పెట్టుబడుల పన్నుల గురించి తెలుసుకోవడం అవసరం.
భౌతిక బంగారం
ఆభరణాలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను విధించడం అనేది మీరు వాటిని ఎంతకాలం ఉంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. భౌతిక బంగారు పెట్టుబడి మూలధన లాభాలపై దీర్ఘకాలం, స్వల్పకాలిక వ్యవధిని బట్టి పన్ను ఉంటుంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది, అయితే మీరు 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పడుతుంది. స్వల్పకాలిక మూలధన లాభాలను మొత్తం పన్ను పరిధిలోకి తీసుకొని వచ్చి అప్పుడు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.
అదే దీర్ఘకాలిక మూలధన లాభం(ఎల్‌టిసిజి)పై 20శాతం + 4శాతం సెస్ పన్ను, అదనంగా సర్‌ఛార్జ్ వర్తిస్తే పన్ను విధిస్తారు. అలాగే మీరు ఆభరణాల విషయంలో భౌతిక బంగారం కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలపై 3% జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు టీడీస్ వర్తించదు. కానీ, మీరు ₹2 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే 1% టీడీస్ వర్తిస్తుంది.(చదవండి: భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?)
డిజిటల్ బంగారం
డిజిటల్ బంగారంపై కూడా భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. అలాగే, పన్ను అనేది మీ పెట్టుబడి కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసిజిగా పరిగణించి 20శాతం పన్ను+సెస్, సర్‌చార్జ్‌లు విధిస్తారు. అయితే డిజిటల్ గోల్డ్‌లో స్వల్పకాల రాబడిపై డైరెక్ట్‌గా పన్ను విధించరు. అయితే, 3 సంవత్సరాల లోపు విక్రయిస్తే ఎటువంటి పన్ను ఉండదు. డిజిటల్ బంగారంపై పెట్టుబడులు అనేది చాలా తక్కువ మొత్తం నుంచి ప్రారంభించవచ్చు. అందుకే ఇది పెట్టుబడిదారులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.
కాగితం బంగారం
బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్, సార్వభౌమ బంగారు బాండ్లు(ఎస్‌జీబి) కలిగి ఉన్న కాగితపు బంగారం కిందకు వస్తాయి. వీటిలో బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్ పై భౌతిక బంగారంతో పాటు సమానంగా పన్ను ఉంటుంది. అయితే, ఎస్‌జీబిలపై పన్నులు కొంచెం భిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ 3 సంవత్సరాలకు పైగా మీ దగ్గర ఉన్నప్పుడు ఎల్‌టిసిజి వర్తిస్తుంది. రేటు కూడా ఒకేవిధంగా ఉంటుంది. 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఆ పెట్టుబడుల లాభాలను మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!)
ఒక ఎస్‌జీబిపై సంవత్సరానికి 2.5% వడ్డీ లభిస్తుంది. అందుకని దీనిని మీ పన్ను పరిధిలోకి తీసుకువచ్చి మీ ప్రధాన ఆదాయంపై ఐటి స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, 8 ఏళ్ల తర్వాత ఎస్‌జీబిల ద్వారా మీరు పొందే ఏవైనా లాభాలు పన్ను రహితం. ఎస్‌జీబిలకు 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అయితే, ముందస్తుగా ఉపసంహరించుకున్నట్లయితే, విభిన్న పన్ను రేట్లు వర్తిస్తాయి. ఐదేళ్ల తరువాత ఎనిమిదేళ్లకు ముందు విత్‌డ్రా చేసుకుంటే ఎల్‌టీసిజి పన్ను 20శాతం+4శాతం సెస్ వర్తిస్తుంది.
గోల్డ్ డెరివేటీవ్
గోల్డ్ డెరివేటీవ్‌లపై వర్తించే పన్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీల నుంచి వచ్చే రాబడిని వ్యాపారంపై వచ్చే ఆదాయంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సంస్థ మొత్తం టర్నోవర్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉంటే 6 శాతం పన్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది. అయితే, టర్నోవర్ ₹2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేము.(చదవండి: అమెజాన్ వెర్షన్ చిట్టి రోబో)
బహుమతి బంగారంపై పన్ను
తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లల నుంచి బంగారం బహుమతిగా అందుకున్నట్లయితే, అది పన్ను రహితం. కానీ, మీరు వారి నుంచి కాకుండా ఎవరైనా బహుమతిగా పొందితే మొత్తం బహుమతి విలువ ₹50,000కు చేరుకుంటే ఐటి స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి నుంచి అయిన ₹50,000 కంటే తక్కువ బహుమతిగా బంగారం పొందితే అది పన్ను రహితం. అయితే, బంగారాన్ని విక్రయించేటప్పుడు భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment