ఎల్ఐసీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం ఏ విధంగా ధరఖాస్తు చేసుకోవాలి..? | How to File Death Insurance Claim With LIC In Telugu | Sakshi
Sakshi News home page

ఎల్ఐసీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం ఏ విధంగా ధరఖాస్తు చేసుకోవాలి..?

Published Sun, Sep 26 2021 6:03 PM | Last Updated on Sun, Sep 26 2021 6:45 PM

How to File Death Insurance Claim With LIC In Telugu - Sakshi

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. ఎప్పటికప్పుడు పాలసీదారుల కోసం కొత్త కొత్త పాలసీలు తీసుకొని వస్తూ వారికి అండగా ఉంటుంది. ఒకవేల ఆ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ఏ విధంగా చేసుకోవాలి. తెలియకపోతే ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది.

అందుకే, డెత్ క్లెయిం ఫైల్ చేసే ప్రక్రియ ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు పాలసీ జారీ చేసిన హోమ్ శాఖను సంప్రదించాలి. ఆ బ్యాంచ్‌కి వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్‌మెంట్ ఆఫీసర్ సంతకాన్ని తీసుకోవాలి.(చదవండి: పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!)

ఎల్ఐసీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ఏ విధంగా చేయాలి..?

  • డెత్ క్లెయిం ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి, పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ హోమ్ బ్రాంచీని నామినీ సందర్శించాలి. నామినీ పాలసీదారుడి మరణం గురించి వారికి తెలియజేయాలి. నామినీ బ్యాంకు ఖాతాలోకి నిధుల బదిలీ కోసం బ్రాంచ్ అధికారి ఫారం 3783, ఫారం 3801, ఎన్‌ఈ‌ఎఫ్‌టి ఫారాలను ఇస్తారు.
  • పైన పేర్కొన్న ఫారాలతో పాటుగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ల్లో ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డు కాపీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఏదైనా ఐడి రుజువు(ప్రాధాన్యతగా ఆధార్ కార్డు). 
  • పూర్తిగా నింపిన ఫారాలు, డాక్యుమెంట్లతో పాటుగా నామినీ డిక్లరేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం గురించి పేర్కొనాల్సి ఉంటుంది.
  • ఎన్‌ఈ‌ఎఫ్‌టి ఫారంతో పాటు నామినీ బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ గల రద్దు చేసిన చెక్ లీఫ్, కాపీని నామినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్, ఫోటోకాపీని ఇతర డాక్యుమెంట్లతో పాటుగా జతచేయకపోతే డాక్యుమెంట్లు ఆమోదించబడవు.
  • పైన పేర్కొన్న డాక్యుమెంట్లను సబ్మిట్ చేసే సమయంలో నామినీ తన పాన్, మరణించిన పాలసీదారుడి ఐడి ప్రూఫ్, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ బ్యాంక్ పాస్ బుక్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి.
  • డెత్ క్లెయిం ప్రాసెసింగ్ కోసం డాక్యుమెంట్లు ఆమోదించడానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్ బుక్ కాపీతో వెరిఫై చేస్తారు. ఈ డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచనాత్మకంగా మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. తుది మొత్తాన్ని నామినీ బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ చేయడానికి ముందు ఎల్ఐసీ అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు.
  • డాక్యుమెంట్లు ఎల్ఐసీ బ్రాంచీలో సబ్మిట్ చేసిన తర్వాత, ఎక్ నాలెడ్జ్ మెంట్ రసీదును సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇతర అదనపు డాక్యుమెంట్లు అవసరం లేనట్లయితే, అప్పుడు నామినీ ఒక నెల వ్యవధిలో సెటిల్ మెంట్ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే, ఒకవేళ ఒక నెలలోపు మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ కాకపోతే, అప్పుడు నామినీ రసీదుని తీసుకొని ఎల్ఐసీ బ్రాంచ్‌కు వెళ్లి స్టేటస్ కోసం అడగాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement