మీరు ఏదైన లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలియాల్సిందే. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరించేందుకు వీలుంటుంది.
సిబిల్ స్కోరు అంటే ఏమిటి?
ప్రభుత్వం ఆధీనంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) సంస్థ మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు వంటివి రికార్డు చేస్తుంది. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు ఈ సిబిల్ స్కోర్‌ను తప్పకుండా పరిశీలిస్తుంది.
ఈ స్కోర్ 300-900 వరకు ఉంటుంది. అధిక స్కోర్(750 కంటే ఎక్కువ) ఉంటే మీకు రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం తదుపరి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
స్కోర్ పెరగాలంటే..
గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.
సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్‌గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.
క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.
క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment