సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్
సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్‌లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.
ఎక్కువగా ఉంటే..
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.
సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.
స్కోర్ పెరగాలంటే..
గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.
సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.
రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్‌గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌సెక్యూర్డ్ లోన్స్‌గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.
క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.
క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలు
స్కోర్ తెలుసుకోవడం ఎలా?
క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్‌సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment