
ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అలాంటి ఎన్నో ప్రశ్నల్లో పది మీకోసం..
- మేం మా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు లేదా కొనవచ్చు?
- మేం ఎంత జాగా కొనవచ్చు? ఇల్లు ఎంత పెట్టి కొనవచ్చు?
- సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు ఎంతవరకు పెట్టవచ్చు?
- మా అమ్మాయి పెళ్లి గ్రాండ్‌గా చేద్దామనుకుంటున్నాం. ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు.
- కంపెనీలలో, వ్యాపార సంస్థల్లో షేర్లు ఎంత పెట్టి కొనవచ్చు.
- స్వంతంగా వ్యాపారం చేద్దామనుకుంటున్నాం. ఎంత పెట్టుబడి పెట్టవచ్చు.
- పిల్లల్ని అమెరికా పంపుతున్నాం. ఎంత ఆస్తి చూపించాలి? ఎంత ఆదాయం చూపించాలి?
- పెద్ద కారు మార్కెట్లోకి వచ్చింది. కొనవచ్చా?
- క్రెడిట్ కార్డుల మీద ఎంత చెల్లించవచ్చు?
- ఫిక్సిడ్ డిపాజిట్లు ఎంత వరకూ వేసుకోవచ్చు?
ఇలాంటి ఎన్నో ప్రశ్నల వర్షం మాకు అలవాటే. ఒక్కొక్కరి అవసరాలు, ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. భాష మారినా, అంకెలు మారినా .. ప్రశ్నల సారాంశం ఒక్కటే. వారు పెట్టే ఖర్చులు .. పెట్టుబడులు, చేసే చెల్లింపులు, తీర్చే అప్పులు మొదలైన వాటన్నింటి కోసం అంత మొత్తం ఎలా వచ్చింది? అంటే సోర్స్ ఏమిటి.. ఆదాయానికి మూలం ఏమిటి.. ఎలా వచ్చింది వంటి ప్రశ్నలు ఎదురైతే .. వారి దగ్గర రెడీమేడ్ ఆన్సర్లు, లాజిక్కులు, వివరణలు, ఉపమానాలు, వితండ వాదాలు, నిజం చెప్పలేని నిస్సహాయత, నిరాకరణ, నిర్లిప్తత లాంటి ఆయుధాలు ఎన్నో ఉంటాయి. కానీ మీరు ఏది చెప్పినా వినే అధికారులకు మూడు విషయాల్లో రాత, కోతలు ఉండాలి. నోటి మాటకు విలువ లేదు. ఈ కింది విషయాలపై స్పష్టత ఉండాలి.
- వ్యవహారం ఎలా జరిగింది? దాని విలువ ఎంత?
- వ్యవహారంలోని వ్యక్తులు ఎవరూ డమ్మీలై ఉండకూడదు.
- ఇచ్చే వ్యక్తికి ‘స్తోమత’ లేదా బ్యాంకులో డబ్బు లేదా ‘సోర్స్’ ఉండాలి. దారిన పోయే దానయ్య దానం ఇవ్వలేడు కదా.
ఆ విధంగా ‘సోర్స్’ అనేది అధికారుల సంతృప్తి మేరకు చూపించగలిగి ఉండాలి. అంటే నూటికి నూరుపాళ్లు ‘వైట్’లోనే జరగాలి. నిజంగానే లావాదేవీ జరగాలి. పారదర్శకత ఉండాలి. పన్నుకి గురయ్యే ‘సోర్స్’ అయితే పన్ను చెల్లించాలి. పన్నుకి గురికాని ‘సోర్స్’ అయితే, లెక్కలు చూపించాలి. అలా జరిగితే ఏ సమస్యా ఉండదు. ఎన్ని ప్రశ్నలకైనా సరే పదిలమైన జవాబులుంటాయి. అలా జరగలేదో ‘‘కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు’’.
- కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment