YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత! | How much money YouTubers make and can earn | Sakshi
Sakshi News home page

YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!

Published Thu, Jan 4 2024 2:37 PM | Last Updated on Thu, Jan 4 2024 3:31 PM

How much money YouTubers make and can earn - Sakshi

ఆధునిక టెక్నాలజీ యుగంలో సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయి. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఎక్స్‌ ఇలా ఎన్నో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. నేటి రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్‌ అయినా లేనివారు ఉంటారేమో గానీ ఏదో ఒక సోషల్‌మీడియా అకౌంట్‌ లేనివారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

ఎన్ని సోషల్‌మీడియా వేదికలు ఉన్నా యూట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకత, ఆదరణ వేరు. అత్యధికమంది ఉపయోగించే సోషల్‌ మీడియా యాప్‌ ఇది. ఇందుకు కారణం పెద్దగా చదువుకోని సమాన్యులు సైతం ఉపయోగించేందుకు వీలుగా ఉండటం, కంటెంట్‌ వీడియోల రూపంలో ఉండటం. యూట్యూబ్‌ యూజర్లు ఏ స్థాయిలో ఉన్నారో అంతే స్థాయిలో కంటెంట్‌ క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అభిరుచిని తీర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందిక్కడ.

యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేటర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ట్రావెలింగ్‌, కుకింగ్‌, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, ఫైనాన్స్‌, న్యూస్‌.. ఇలా రకరకాల కంటెంట్‌ను యూట్యూబర్లు క్రియేట్‌ చేసి వీక్షకుల ముందుకు తెస్తున్నారు. యూట్యూబర్లు అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు.. అంటూ మాట్లాడుకోవడమే గానీ వారికి డబ్బు ఎలా వస్తుంది.. ఎంత మంది చూస్తే ఎంత డబ్బు వస్తుంది.. అన్న లెక్కలు చాలా మందికి తెలియవు. ఈ లెక్కల్ని అర్థం చేసుకుని, ఒక యూట్యూబర్‌ ఎంత సంపాదించగలరు అన్నది అంచనా వేయాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాం.. 

డబ్బు ఎలా వస్తుంది?
స్పాన్సర్‌షిప్‌ల నుంచి మొదలు పెట్టి ఉత్పత్తుల ప్రమోషన్‌ వరకూ పలు రకాల మార్గాల్లో యూట్యూబర్లు డబ్బు సంపాదించవచ్చు. 
కానీ గూగుల్‌ ప్రకటనలు (Google Ads) నుంచే వచ్చే ఆదాయమే అత్యధికం. యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌లో చేరిన సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోల ద్వారా గూగుల్‌ ప్లేస్డ్‌ యాడ్స్‌తో (Google-placed ads) డబ్బు సంపాదించవచ్చు.

ఈ అర్హతలుండాలి
యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేయడానికి, క్రియేటర్‌లు తప్పనిసరిగా కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్‌లోడ్‌లు చేసి ఉండాలి. సంవత్సర కాలంలో 3,000 వాచింగ్‌ అవర్స్‌ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ల యూట్యూబ్‌ షార్ట్‌ల వీక్షణలను కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉండి ఒకసారి అప్రూవల్‌ పొందిన తర్వాత, అర్హత కలిగిన క్రియేటర్‌లు ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌లు, సూపర్ థాంక్, యూట్యూబ్‌ షాపింగ్‌తో తమ సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే సామర్థ్యం వంటి ఫీచర్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

ఇక యూట్యూబ్‌ యాడ్‌సెన్స్‌ (YouTube AdSense) నుంచి డబ్బు సంపాదన ప్రారంభించడానికి, ప్రోగ్రామ్‌లోని క్రియేటర్లు తప్పనిసరిగా 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. సంవత్సర కాలంలో  4,000 వాచింగ్‌ అవర్స్‌ను కలిగి ఉండాలి.

ఎంత మంది చూస్తే ఎంత డబ్బులు?
తమతో యూట్యూబర్‌లు పంచుకున్న రెవెన్యూ పర్‌ మిల్లీ (RPM) రేట్ల ఆధారంగా బిజినెస్‌  ఇన్‌సైడర్‌ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రతి 1,000 వీక్షణలకు 1.61 నుంచి 29.30 డాలర్లు (రూ.130 నుంచి రూ.2,400) యూట్యూబర్లు సంపాదిస్తున్నారు.

యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్ నుంచి యూట్యూబర్‌లు నెలకు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది వీక్షణల మొత్తం, ఆడియన్స్‌ లొకేషన్‌, కంటెంట్ కేటగిరి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అధ్యయనం చేసిన ఓ 28 మంది యూట్యూబర్ల నెలవారీ ఆదాయాలు 82 నుంచి 83,000 డాలర్ల వరకూ (రూ.6,800 నుంచి సుమారు రూ.70 లక్షలు) ఉన్నాయి.

ఈ ఆదాయాలు నెలవారీగా మారవచ్చు. ఉదాహరణకు సుమారు లక్ష మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఓ యూట్యూబర్ ఒక నెలలో 1,000 డాలర్లు (రూ.83,000) సంపాదిస్తే మరొక నెలలో 6,000 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) వరకు సంపాదించినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది.

ఇక ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వ్యక్తిగత ఫైనాన్స్ గురించి వీడియోలను రూపొందించే మరో యూట్యూబర్ ఒకే నెలలో 50,000 డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించారు .

గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement