కార్పొరేట్‌ జపం! | A huge increase from 2018 with the letter Z | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ జపం!

Published Thu, Oct 24 2024 4:25 AM | Last Updated on Thu, Oct 24 2024 8:19 AM

A huge increase from 2018 with the letter Z

జెడ్‌ అక్షరంతో మొదలయ్యే బ్రాండ్‌లు, కంపెనీల వెల్లువ

2018 నుండి భారీగా పెరుగుదల... 

కలిసొస్తున్న జెన్‌ జెడ్‌ మేనియా

న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ పరంగానూ కనెక్ట్‌!  

ఆల్ఫాబెట్స్‌లో చిట్టచివరి అక్షరమే అయినా.. కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలకిపుడు ‘జెడ్‌’ తొలి ప్రాధాన్యంగా మారుతోంది. జెన్‌ జెడ్‌ ఎఫెక్ట్‌ కావచ్చు... మరేదైనా కారణం కావచ్చు.. ‘జె’వ్రీథింగ్‌ ‘జెడ్‌’ అనేలా బ్రాండ్‌ బా‘జా’ మోగుతోంది. దశాబ్దకాలంగా జెడ్‌ కంపెనీల జోరు ఓ రేంజ్‌లో పెరుగుతూ వస్తోంది! 

కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 1,608 కంపెనీలు జెడ్‌ అక్షరంతో పురుడు పోసుకున్నాయి. 2018తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 70 శాతం ‘జూ’మ్‌ అయ్యింది. మొత్తంమీద ఏర్పాటవుతున్న కొత్త కంపెనీల సంఖ్య ఏటా 9 శాతం పెరుగుతుండగా.. జెడ్‌ కంపెనీల జోరు 11 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికే 1,493 కంపెనీలు జెడ్‌ అక్షరంతో ఆవిర్భవించడం గమనార్హం. 

పేరులో ‘జో’ష్‌ ఉంది... 
మన దేశంలో ఎవరికైనా.. దేనికైనా పేరు పెట్టడం అంటే పెద్ద ప్రహసనమే. వ్యక్తిగత అంశాల నుంచి, ఆచారాలు, మతాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం ఇలా చాలా విషయాలు ప్రభావం చూపుతుంటాయి. అయితే, కంపెనీలు పేర్లు ఖాయం చేయడంలో ఈ అంశాలకు తోడు బ్రాండింగ్, మార్కెటింగ్‌ టెక్నిక్‌లు ఇతరత్రా బోలెడన్ని విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

‘మేము ఆట బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పడు ఏదైనా సరదాగా ఉండే పేరు కోసం బుర్రబద్దలు కొట్టుకున్నాం. చివరకు జనాల నోళ్లలో నానేలా జిగ్‌మ్యాగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే పేరును నిర్ణయించాం’ అని ముంబైకి చెందిన హేతల్‌ సంగానీ చెబుతున్నారు. వాస్తవానికి జిగ్‌జాగ్‌ అని పెడదామనుకున్నా.. అది అప్పటికే వేరొకరు రిజిస్టర్‌ చేసుకోవడంతో జిగ్‌మ్యాగ్‌ను ఎంచుకోవాల్సి వచి్చందని ఆయన పేర్కొన్నారు. బ్రాండ్‌ పేరు పలికేటప్పుడు ఒకరకమైన జోష్‌ ఉండాలని కొత్తతరం ఎంట్రప్రెన్యూర్స్‌ కోరుకుంటున్నారు. బోరింగ్‌గా, పాత వాసనలతో ఉండకూడదనేది వారి అభిప్రాయం.

 ‘ఈ రోజుల్లో ప్రమోటర్లు పేర్లను ఎంచుకునేటప్పుడు క్యాచీగా, ప్రత్యేకంగా, ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. ఆ్రస్టాలజీ, న్యూమరాలజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆల్ఫాబెట్స్‌లో ‘ఏ’ అక్షరంతో కంపెనీలకు కొదవలేదు. దీంతో చివరిదైన జడ్‌కు ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ ఉంది’ అని కంపెనీ సెక్రటరీ ఎస్‌ఎస్‌ విశ్వనాథన్‌ తెలిపారు. 1992లో మీడియా మొఘల్‌ సుభాష్‌ చంద్ర నెలకొల్పిన ‘జీ టీవీ’ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు! ఇక కొత్తగా నెలకొలి్పన ‘జీ5’ ఓటీటీ కూడా బంపర్‌ హిట్టే!!

‘జెడ్‌’ ఫ్యాక్టర్‌!
డిస్కౌంట్‌ బ్రోకరేజీగా ఆరంభమైన ‘జెరోధా’ ఇప్పుడు దేశంలో టాప్‌ బ్రోకింగ్‌ కంపెనీగా ఎదగడంలో జెడ్‌ ఫ్యాక్టర్‌ కూడా బాగానే పని చేసిందని చెప్పొచ్చు. క్విక్‌ కామర్స్‌ సంచలనం జెప్టో పేరు కూడా మార్మోగుతోంది. జీలక్స్‌ ఫ్యాషన్స్, జెనెర్జీ ఫుడ్స్, జోల్డ్‌ అకాడమీ, జోబుల్‌ ఈస్టోర్, జాయిడ్‌ ఏఐ, జెలో టెక్నాలజీస్, జిమన్స్‌ టూర్స్, జోఫర్స్, జింబర్‌ ఇండియా, జూజూ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, జప్నోసిస్, జెన్‌నెక్ట్స్‌ ఇండియా ఇవన్నీ ఇటీవలి జెడ్‌ మేనియాలో జస్ట్‌ చిన్న లిస్ట్‌ మాత్రమే!

 ‘ఆల్ఫాబెట్స్‌లో కొన్ని పలికేందుకే కాదు.. వినేందుకు కూడా చాలా సొగసుగా ఉంటాయి. అలాంటి వాటిలో జెడ్‌ లేదా జీ  కూడా ఒకటి. అంతేకాదు, నవతరం జెన్‌ జెడ్‌కు కూడా ఇది భలే కనెక్ట్‌ అవుతోంది. మరీ పెద్దగా కాకుండా నాలుగు అక్షరాలలోపు ఉండేవి పంచింగ్‌గా ఉంటాయి’ అంటున్నారు బ్రాండ్‌ స్ట్రాటజీ స్పెషలిస్ట్‌ హరీష్‌ బిజూర్‌. జాప్, జారా, జీల్, జీబ్రా, జీ, జెన్, జెనిత్, జెస్ట్, జెటా, జియస్, జిలియన్, జింగ్, జియాన్, జూమ్‌ వంటివి వీటిలో కొన్ని.

జెడ్‌ = 8
ఇక న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) పరంగా కూడా జెడ్‌ అక్షరానికి విశిష్టత ఉందంటున్నారు నిపుణులు. జెడ్‌ అనేది 8 అంకెను సూచిస్తుందని... భౌతిక శక్తి, స్థిరత్వం, పరివర్తనను ఇది చాటిచెబుతుందనేది న్యూమరాలజిస్టుల మాట! దీని ఆకారం విషయానికొస్తే.. జిగ్‌జాగ్‌ షేపు అనేది వినూత్నత, ఆధునికతకు చిహ్నంగా ఉంటుందని.. నవతరానికి, బ్రాండింగ్, సోషల్‌ మీడియాలో గుర్తింపునకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుందని బ్రాండింగ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం (ఆ్రస్టాలజీ) సంగతి చూస్తే... జెడ్‌ అక్షరంపై గురుడు లేదా బృహస్పతి గ్రహ బలం అధికంగా ఉంటుందని గుజరాత్‌కు చెందిన ఆ్రస్టాలజర్‌ మనీష్‌ భట్‌ చెబుతున్నారు. ‘ప్రస్తుతం గ్రహాల కదలికలు... జెడ్‌ అక్షరం వాడకంపై చాలా సానుకూల ప్రభావం చూపుతున్నాయి’ అని భట్‌ వ్యాఖ్యానించారు!

జెరోధా... జోహో.. జొమాటో.. జూడియో.. జెప్టో... జాగిల్‌ ప్రీపెయిడ్‌.. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది! అయితే ఏంటంటరా? జెన్‌ జెడ్‌ మేనియాతో జెడ్‌ (జీ) నామజపం జోరందుకుంది. జెడ్‌ అక్షరంతో మొదలయ్యే బ్రాండ్లు, కంపెనీల సంఖ్య ఏటికేడు ఎగబాకుతుండటమే దీనికి నిదర్శనం. పలకడానికి ఈజీగా, వినసొంపుగా... బ్రాండ్‌ నేమ్‌ కూడా ఎఫెక్టివ్‌గా ఉండటంతో వీటికి ప్రాచుర్యం పెరుగుతోంది. అంతేకాదు.. ఇటీవల జెడ్‌ అక్షరంతో వచ్చిన పలు బ్రాండ్లు బిజినెస్‌ హిట్‌ కొట్టి.. ఆయా రంగాల్లో జనాలకు చిరపరిచితంగా కూడా మారిపోవడం విశేషం!! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement