ముప్పై ఏళ్లలోపు యువతకు ఎక్కువగా స్నేహితులతో గడపాలని, మంచి బైక్‌పై చక్కర్లు కొట్టాలని, మంచి దుస్తులు కొనాలని.. ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రం సమయం వృథా చేయకుండా జీవితంలో స్థిరపడాలనుకుంటారు.
అయితే అది అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ, ఆ వయసులోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతూ వందల కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యమైన విజయం. తాజాగా హురున్ ఇండియా అలాంటి 100 మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు.
‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ముంబయికి చెందిన జెప్టో క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా (21 ఏళ్లు), ఆదిత్ పలిఛ (22 ఏళ్లు)లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్‌టెక్ సంస్థ, భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం అయిదుగురు మహిళలు ఉండగా.. ‘స్కిల్‌మ్యాటిక్స్’కు చెందిన దేవాన్షి కేజ్రీవాల్ (27 ఏళ్లు) అందరి కంటే చిన్నవారు. 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్‌టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో అధికంగా సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉన్నారు. ఫిన్‌టెక్, ఎడ్‌టెక్ రంగాలకు చెందిన 11 కంపెనీల ప్రతినిధులకు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీలు/ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబయి, దిల్లీకి చెందిన వారు ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబయి నుంచి 9 మంది, దిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు.
ఈ జాబితాలో స్థానం సంపాదించిన యువ వ్యాపారవేత్తల్లో ఐఐటీ-రూర్కీ పట్టభద్రులైన 8 మంది ఉండటం గమనార్హం. ఐఐటీ- కాన్పూర్ నుంచి ఏడుగురు, ఐఐటీ- దిల్లీ నుంచి ఆరుగురు, ఐఐటీ- బాంబే, మద్రాస్ నుంచి అయిదుగురు చొప్పున ఉన్నారు.
మనదేశంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తి, సామర్థ్యాలను ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ ప్రతిబింబిస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రహమాన్ జునాయిద్ వివరించారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యాపార వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించగల సామర్థ్యం ఉన్న యువ వ్యాపారవేత్తల అవసరాలు ఎంతో అధికంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, బహుళజాతి వ్యాపార సంస్థలు ఇటువంటి సత్తా ఉన్న యువ వ్యాపారవేత్తలు, సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు విశ్లేషించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిన్న వయసు లోనే మంచి విజయాలు నమోదు చేసి హురున్ జాబితాలో స్థానం సంపాదించారు. హైదరాబాద్ నుంచి నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు, భాంజు, ఎడ్యుటెక్ కంపెనీ)తో పాటు, శశాంక్ రెడ్డి గుజ్జుల (27 సంవత్సరాలు, నెక్ట్స్‌వేవ్, ఎడ్యుటెక్ కంపెనీ), రాకేష్ మున్ననూరు (29 ఏళ్లు, విజిల్‌డ్రైవ్, సాస్ కంపెనీ), అనురాగ్ మాలెంపాటి (30 ఏళ్లు, లీప్ ఇండియా ఫుడ్, లాజిస్టిక్స్ సేవల కంపెనీ) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన అనుపమ్ పెడర్ల (29 ఏళ్లు, నెక్ట్స్‌వేవ్, ఎడ్‌టెక్ కంపెనీ)కు సైతం ఈ జాబితాలో స్థానం దక్కింది.
ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్‌ఆఫ్.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment