Hyderabad Startup Donatekart Founders Listed on Forbes India 30 Under 30 2022 - Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!

Published Mon, Feb 7 2022 7:42 PM

Hyderabad Startup Donatekart Founders Listed on Forbes India 30 Under 30 2022 - Sakshi

ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లు చోటు సంపాదించారు. ఈ విషయాన్ని టీ-హబ్ తన ట్విటర్ వేదికగా పోస్టు చేసింది. టీ-హబ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఆ ముగ్గురికి అభినందనలు తెలిపారు. టీ-హబ్ తన ట్విటర్ వేదికగా ఇలా పోస్టు చేసింది.. "ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 #ForbesIndia30U30 జాబితాలో చోటు సంపాదించిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26)లకు అభినందనలు. నేడు, సామాజిక కారణాలకు మేము ఎలా మద్దతు ఇస్తున్నామో పునర్నిర్వచించడం మా #Lab32 ఉద్దేశ్యం" అని పేర్కొంది.  

డొనేట్ కార్ట్ 
దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ రెడ్డి(26), సందీప్ శర్మ(26), సారంగ్ బోబాడే(26) డొనేట్ కార్ట్ పేరిట ఈ ఆన్‌లైన్ వేదిక‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్ ఐఐటీలో చ‌దివిన వీరు ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి పనిచేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్‌జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి https://www.donatekart.com వెబ్‌సైట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న‌ 1500 స్వచ్ఛంద సంస్థలను ఇందులో చేర్చి వాటికి వార‌థిగా మారారు.

ఇన్నోవేషన్‌ అవార్డు ఎంపిక
ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్‌జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు. కేవలం కొవిడ్‌ పంజా విసిరిన కాలంలోనే రూ.55 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌తో అనేక వర్గాలకు సాయం చేశారు. దీంతో డొనేట్‌ కార్ట్‌ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్‌ 2018లో ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్‌ వారికి అందజేశారు. ఇప్పటి వరకు పది లక్షల మంది దాతలు 1,000 ఎన్జీవోలకు రూ.150 కోట్లకు పైగా విరాళాలు అందించారు.

(చదవండి: చదువు కోసం ఎన్ని కష్టాలో ? పేటీఎం విజయ్‌ శేఖర్‌ శర్మ!)

Advertisement
 
Advertisement
 
Advertisement