హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఈ-చలాన్లు అందుకుంటూ, ఆర్థిక సమస్యలతో వాటిని కట్టకుండా పెండింగ్‌లో పెట్టిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా పోలీస్‌శాఖ రాయితీలను ప్రకటించింది. రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఉపశమనం కలిగిస్తూ పెండింగ్ చలాన్లలో రాయితీని ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్‌శాఖ మార్చి 1 నుంచి 30 తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. వాహనదారులకు భారీ స్థాయిలో హైదరాబాద్ పోలీసులు రిబెట్ ప్రకటించారు. ద్విచక్ర వాహనదారుల చలాన్ మొత్తంలో 25 శాతం చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు మిగత 75 శాతాన్ని పోలీస్‌శాఖ మాఫీ చేయనుంది. అంతేకాకుండా కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు హైదరాబాద్ పోలీస్‌శాఖ ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం రూ.600 కోట్లకు పైగా పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్లపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. చలానాల్లో రాయితీ ఇవ్వడం ద్వారా వాహనదారులు జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
(చదవండి: సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!)
Comments
Please login to add a commentAdd a comment