హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.
విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.
ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment