న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్‌ఎంఐఎల్)ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్‌ఎంఐఎల్.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్‌ఎంఐఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ రికార్డును అధిగమించే వీలుంది.
రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్‌ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్‌ఎంఐఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్‌లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment