న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున అనుకోని విధంగా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది.
వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతునిస్తామని, అయితే ఈ–కామర్స్ వ్యాపారంపరంగా ప్రతిపాదిత సవరణల్లో పలు అంశాలు అస్పష్టంగా ఉండటం ఆందోళనకరమని ఐఏఎంఏఐ తెలిపింది. కొన్ని సవరణల వల్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారాలకు సమాన అవకాశాలు దక్కకుండా పోతాయని పేర్కొంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలపై ఆంక్షలు మరింతగా పెరుగుతాయని, మరిన్ని నిబంధనలను పాటించాల్సిన భారం గణనీయంగా పెరుగుతుందని ఐఏఎంఏఐ అభిప్రాయపడింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు తన అభిప్రాయాలను తెలియజేసింది.
ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలపై మోసపూరిత ఫ్లాష్ సేల్స్‌ను, తప్పుగా ఉత్పత్తులు, సేవలను అంటగట్టే విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా జూన్ 21న కేంద్రం ఈ–కామర్స్ నిబంధనల ముసాయిదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 5 దాకా పరిశ్రమవర్గాలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇప్పటికే ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ వర్గాలు తమ ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేశాయి.
చదవండి : వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
Comments
Please login to add a commentAdd a comment