![If Name will Change From OpenAI To ClosedAI Musk Suspends Legal Suit - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/7/musk01.jpg.webp?itok=jByuPpBb)
చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్‌ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై టెస్లా అధినేత ఎలోన్‌మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్‌ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరు మారిస్తే దావా వెనక్కి తీసుకుంటానని మస్క్ తెలిపినట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది.
ఓపెన్‌ఏఐ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని మస్క్ చెప్పారు. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్‌ఏఐ అబద్ధాల్లో జీవించడం మానేయాలని హితవు పలికారు. అలాగే ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ‘క్లోజ్డ్‌ఏఐ’ ఐడీ కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్ చేసిన ఫొటోను మస్క్ (Elon Musk) తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
Fixed it pic.twitter.com/KPtYLsJU3h
— Elon Musk (@elonmusk) March 6, 2024
ఓపెన్‌ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్‌ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు.
ఈ వ్యవహారంపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ బహిర్గతం చేసింది.
ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’
2022 నవంబరులో వచ్చిన చాట్‌జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్‌ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment