సాక్షి, ముంబై: ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) 2021–22 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) నోటిఫై చేసింది. సాధారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అసెస్‌మెంట్ సంవత్సరం అవుతుంది. సీబీడీటీ నోటిఫై చేసిన ఐటీఆర్‌లను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఐటీఆర్‌లలో పరిమిత మార్పులనే చేశారు.
2020 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆదాయపన్ను చట్టంలోని సవరణల మేరకు మార్పులను పొందుపరిచారు. అదే సమయంలో..గతేడాది కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాట్లను ఐటీఆర్‌ల నుంచి తొలగించారు. డీఐ షెడ్యూల్ కూడా ఇలా తొలగించిన వాటిల్లో ఒకటి. డీఐ అంటే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు/డిపాజిట్లు/చెల్లింపుల వివరాలు. 2021-22 అసెస్‌మెంట్ ఐటీఆర్‌లలో డీఐ కాలమ్ కనిపించదు. వీటితోపాటు ఐటీఆర్‌లలో ఏఏ మార్పులు చోటు చేసుకున్నదీ వివరంగా తెలుసుకుంటే.. రిటర్నుల దాఖలు మరింత సులభమవుతుంది.
ఐటీఆర్-1కు సంబంధించి చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. సెక్షన్ 194ఎన్ కింద పన్ను చెల్లింపుదారులు ఎవరికైతే మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)అమలవుతుందో.. వారు ఐటీఆర్–1 రూపంలో రిటర్నులు దాఖలు చేయరాదు. సెక్షన్ 194 కింద బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలు,పోస్టాఫీసులకూ ఇది వర్తిస్తుంది. మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారు నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే అప్పుడు 2 శాతం టీడీఎస్‌ను మినహాయిస్తాయి.
ఒకవేళ సదరుఖాతాదారు అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఐటీఆర్‌లను దాఖలు చేయనట్టయితే.. అప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 20లక్షలు మించినా 2 శాతంటీడీఎస్‌ను అమలు చేయాలి. లేదా రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 5 శాతాన్ని అమలు చేయాలి. ఇటీవల పన్ను చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. ఉద్యోగులు తమకు సంస్థజారీ చేసిన ఈసాప్‌లపై (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్) పన్నును వాయిదా వేయదలుచుకుంటే అప్పుడు ఐటీఆర్1 లేదా ఐటీఆర్2 బదులు.. ఐటీఆర్ 2, 3 దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈసాప్‌లపై పన్ను వాయిదా
ఈసాప్‌లపై పన్నును వెంటనే చెల్లించాల్సిన పని లేకుండా, వీలునుబట్టి వాయిదా వేసుకునే సౌకర్యాన్ని బడ్జెట్ 2020లో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈసాప్‌లపై రెండు సార్లు పన్నుపడుతుంది. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి ఈ సాప్‌లు అందుకున్నప్పుడు ఒక పర్యాయం, ఉద్యోగి తిరిగి స్టాక్ ఆప్షన్లను విక్రయించినప్పుడు వచ్చిన మూలధన లాభాలపై మరో పర్యాయంపన్ను చెల్లించాల్సి ఉంటుంది.
చట్టంలో చేసిన సవరణ ప్రకారం.. అర్హత కలిగిన స్టార్టప్‌ల ఉద్యోగులు తాము అందుకున్న ఈసాప్‌లపై పన్నును వాయిదా వేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్లుకేటాయించిన ఆర్థిక సంవత్సరం ముగింపు నుంచి 48 నెలల పాటు అంటే నాలుగేళ్ల వరకు ఇలా పన్నును వాయిదా వేసుకునే సౌకర్యం ఉంది. ఈసాప్‌లపై ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను,వాయిదా వేసుకుంటున్న పన్నును వివరంగా షెడ్యూల్ టీటీఐ (కంప్యుటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ టోటల్ ఇన్‌కమ్)లో పేర్కొనాలి.
డివిడెండ్ ఆదాయం..
డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను ఎత్తేసి.. డివిడెండ్ అందుకున్న వ్యక్తి పన్ను చెల్లించాలన్న సవరణను గతంలో తీసుకొచ్చారు. దీంతో ఐటీఆర్‌లలో డీడీటీ సెక్షన్‌ను ఎత్తేసి షెడ్యూల్ ఓఎస్ (ఇతర వనరుల ద్వారా ఆదాయం)ను తాజా సవరణలకు అనుగుణంగా మార్పు చేశారు. అంటే ఇతర వనరుల ద్వారా ఆదాయం కాలమ్‌లోనే డివిడెండ్ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. డివిడెండ్ ఆదాయానికి సంబంధించి వడ్డీ వ్యయాలు ఏవైనా చేసి ఉంటే (రుణాలు తీసుకుని చెల్లింపులు).. వాటిని సెక్షన్ 57(1) కింద తగ్గించి చూపించుకునేందుకు కొత్తగా ఒక వరుసను ప్రవేశపెట్టారు.
భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో నివసించే భారతీయుల పన్ను చెల్లింపుదారులు అందుకునే డివిడెండ్‌కు సంబంధించి కొత్త వరుసలను చేర్చారు. సెక్షన్ 115ఏ కింద ప్రవాస భారతీయులు అందుకునే డివిడెండ్‌పై ప్రత్యేక పన్ను రేటును వసూలు చేయనున్నారు. ఐటీఆర్ 2, 3, 4ను దాఖలు చేసే వారు డివిడెండ్ ఆదాయాన్ని త్రైమాసికాల వారీగా వేరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్–1 దాఖలు చేసే వారు సైతం డివిడెండ్ ఆదాయాన్ని నాలుగు త్రైమాసికాలుగా వేరు చేసి చూపించాలి. దీంతో అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను చెల్లింపులు) బాధ్యతను లెక్కించేందుకు పన్ను అధికారులకు సులభంగా ఉంటుంది.
రాయితీ పన్ను రేట్లు
2021-22 అసెస్‌మెంట్ సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 115బీఏసీ కింద తక్కువ పన్ను రేట్ల విధానాన్ని ఎంచుకోవచ్చు. దీన్ని ఎంపిక చేసుకుంటే కొన్నిమినహాయింపులు, తగ్గింపులను కోల్పోవాల్సి వస్తుంది. అన్ని ఐటీఆర్‌లలోనూ పార్ట్–ఏలో పన్ను చెల్లింపుదారులు తాము 11బీఏసీ కింద నూతన పన్ను విధానాన్ని ఎంపికచేసుకుంటున్నట్టు అయితే తెలియజేయాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి పరమైన ఆదాయం కలిగిన వారు నూతన విధానాన్ని గడువులోపు 10-ఐఈ దాఖలు చేయడం ద్వారాఎంచుకోవాలి. ఫామ్ 10–ఐఈ దాఖలు చేసిన తేదీ, అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను ఐటీఆర్-3లో పొందుపరచాలి. ఐటీఆర్-3లో షెడ్యూల్ డీపీఎం (ప్లాంట్, మెషినరీ విలు వ తరుగుదల), షెడ్యూల్ యూడీ (సర్దుబాటు చే యని తరుగుదల)లకు సంబంధించి మినహాయిం పులను ఇప్పుడు వదులు కోవాల్సి ఉంటుంది.
ఎవరు ఏ రిటర్నులు దాఖలు చేయాలి
♦ ఐటీఆర్–1
వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు (దేశంలో నివసించే వారు) లేదా, మరియు ఒక ఇల్లు కలిగి ఉండి.. వ్యవసాయ ఆదాయం రూ.5,000లోపు కలిగినా, ఇతర ఆదాయం (వడ్డీ ఆదాయం) ఉన్నా.. అంతా కలుపుకుని సంవత్సరాదాయం రూ.50లక్షల్లోపు ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. మినహాయింపులు: పైన చెప్పుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి.
ఎలా అంటే.. రూ.50లక్షల్లోపు ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డ్‌లో డైరెక్టర్‌గా ఉన్నా లేదా ఏదేనీ అన్‌లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఐటీఆర్-1 దాఖలు చేయకూడదు. అదే విధంగా సెక్షన్ 194 ఎన్ కింద టీడీఎస్ మినహయించినా లేదా ఈసాప్‌పై పన్నును వాయిదా వేసుకున్న వారు కూడా ఐటీఆర్–1 దాఖలు చేయడానికి లేదు. ఇంటిపై నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు.. ఇతర వనరుల రూపంలో నష్టాన్ని కూడా క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు సైతం ఐటీఆర్-1 దాఖలు చేయరాదు
♦ ఐటీఆర్-2: ఐటీఆర్-1 దాఖలు చేసే అర్హత లేని వ్యక్తులు (ఎన్‌ఆర్‌ఐలు సైతం), హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం, లాభాలు లేనట్టయితే ఐటీఆర్-2 దాఖలుకు అర్హులు.
♦ ఐటీఆర్-3 :వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం, లాభాలు కలిగి.. ఇతర రూపాల్లో ఆదాయం లేనట్టయితే అప్పుడు ఐటీఆర్–3 దాఖలు చేయాల్సి ఉంటుంది.
♦ ఐటీఆర్-4 : వృత్తి, వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్–4ను దాఖలు చేయాలి. సెక్షన్ 44ఏడీ కింద వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంపై ప్రిసంప్టివ్ ట్యాక్స్‌ను ఎంపిక చేసుకున్న వ్యక్తులు (స్థానిక నివాసులు), హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్‌ఎల్‌పీ కానివి) రూ.50లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉంటే ఐటీఆర్-4ను దాఖలు చేయాలి.
♦ఐటీఆర్-5/6/7: ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యక్తులు (పై విభాగాల్లోకి రాని వారు), ఎల్‌ఎల్‌పీలు, సంస్థలు, కంపెనీలకు ఐటీఆర్-5, 6, 7 వర్తిస్తాయి.
♦ ప్రిసంప్టివ్ ట్యాక్స్: వృత్తి నిపుణులు లేదా సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.50లక్షల వరకు ఉంటే ప్రిసంప్టివ్ ట్యాక్స్ స్కీమ్‌ను ఎంచుకుని.. తన టర్నోవర్‌లో 50% పన్ను వర్తించే ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించే సౌలభ్యత ఉంది)
Comments
Please login to add a commentAdd a comment