న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది.
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment