Core Sector
-
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్‌లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
మౌలిక పరిశ్రమల వృద్ధి అంతంతే...
న్యూఢిల్లీ: కీలక మౌలికరంగ పరిశ్రమల పనితీరు నవంబర్‌లో మందకొడిగానే నమోదైంది. ప్రధానంగా సహజవాయువు, ఎరువులు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత పేలవంగా ఉండటంతో.. వృద్ధిరేటు 1.7 శాతానికే పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మౌలిక వృద్ధి 5.8 శాతంగా ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో మైనస్ 0.6 శాతం క్షీణతతో పోలిస్తే.. నవంబర్‌లో తిరిగి వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. బొగ్గు, ముడిచమురు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన 8 రంగాల మౌలిక పరిశ్రమలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 38% వెయిటేజీ ఉంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలంలో మౌలిక వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఇది 6.7%. నవంబర్ ఐఐపీ గణాంకాలపై ఈ మౌలిక వృద్ధి మందగమనం ప్రభావం ఉంటుందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషి పేర్కొన్నారు. అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 1.8 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. రంగాలవారీగా మౌలిక పనితీరు.. నవంబర్‌లో గ్యాస్ ఉత్పాదకత మైనస్ 11.3 శాతం కుంగింది. గతేడాది ఇదే నెలలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 15 శాతం క్షీణించింది. ఇక పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత 29.8 శాతం వృద్ధి నుంచి మైనస్ 5 శాతం క్షీణతలోకి జారిపోయింది. ఎరువుల ఉత్పాదకత వృద్ధి 0.6%కే(గత నవంబర్‌లో 5%) పరిమితమైంది. ఉక్కు ఉత్పాదకత కూడా వృద్ధి 7.8% నుంచి 3.9 శాతానికి పడిపోయింది. సిమెంట్(4.2% వృద్ధి), విద్యుత్(5.9%), బొగ్గు(2.3%), క్రూడ్(1.1%) రంగాలు గతేడాది నవంబర్‌తో పోలిస్తే కాస్త మెరుగైన వృద్ధిని సాధించాయి. -
పరిశ్రమలు పాతాళంలో..
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదు కాలేదు. పైగా క్షీణత బాటలో మైనస్ (-) 1.8 శాతంలోకి జారిపోయింది. అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే సంబంధిత సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణించిందన్నమాట. వరుసగా రెండు నెలల క్షీణబాట వీడి జూలై నుంచీ వరుసగా మూడు నెలల పాటు 2012 ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ కొద్దోగొప్పో వృద్ధి సాధిస్తూ వస్తోంది (జూలైలో 2.8 శాతం, ఆగస్టులో 0.4 శాతం, సెప్టెంబర్‌లో 2 శాతం). అయితే తిరిగి అక్టోబర్‌లో క్షీణతలోకి జారిపోయింది. గురువారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 8.4 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం ఐఐపీలో అసలు వృద్ధి నమోదు కాలేదు. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.2 శాతం. కీలక రంగాలు ఇలా... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 9.9 శాతం వృద్ధి నుంచి 2.0 క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం 1.1 శాతం వృద్ధి నుంచి -0.3 శాతం క్షీణతలోకి జారింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్‌లలో 10 గ్రూపులు అక్టోబర్‌లో ప్రతికూలతను నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఐఐపీలో 14 శాతం వాటా కలిగిన ఈ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -0.2 శాతం నుంచి -3.5 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి ఏడు నెలల కాలంలో ఈ రేటు -1 శాతం నుంచి -2.7 శాతానికి పడిపోయింది. విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి సైతం 5.5 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య మాత్రం ఈ రేటు 4.7 శాతం నుంచి 5.3 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌ను ప్రతిబింబించే ఈ రంగంలో వృద్ధిరేటు 7 శాతం నుంచి 2.3శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో చూస్తే క్షీణత కొంత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువులు: ఈ విభాగం అక్టోబర్‌లో అసలు వృద్ధిని నమోదుచేసుకోలేదు. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి 13.8 శాతంకాగా, 2013 ఇదే నెలలో ఈ రేటు -5.1 శాతంగా ఉంది. ఇక ఏడు నెలల కాలంలో 4.2 శాతం వృద్ధి రేటు -1.8 శాతంలోకి జారిపోయింది. ఈ విభాగంలో భాగమైన కన్సూమర్ డ్యూరబుల్స్ మొత్తంగా కూడా క్షీణతలోకి జారింది. 16.7 శాతం వృద్ధి నుంచి భారీగా 12 శాతం క్షీణతలోకి పడిపోయింది. ఏడు నెలల కాలంలో 5.7 శాతం వృద్ధి రేటు సైతం -11.2 క్షీణతలోకి జారిపోయింది. ఇక ఈ విభాగంలో మరో భాగమైన నాన్-డ్యూరబుల్స్ విభాగం వృద్ధి 11.2 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో ఈ రేటు వృద్ధి 2.8 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే...: పారిశ్రామిక వర్గాలు అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తయారీ రంగంసహా పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. వడ్డీరేట్ల కోత జరగనిదే సమీప భవిష్యత్తులో పారిశ్రామికోత్పత్తి మెరుగుదలను చూడలేమని ఆమె అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుత స్థాయికన్నా తక్కువకు పడబోదని, పారిశ్రామిక క్రియాశీలత తిరిగి మెరుగవుతుందని ఇటీవల నెలకొన్న ఆశలపై ఈ గణాంకాలు నీళ్లుజల్లాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే పటిష్ట, నిర్ణయాత్మకమైన పాలసీ నిర్ణయాలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.