మౌలిక పరిశ్రమల వృద్ధి అంతంతే...
న్యూఢిల్లీ: కీలక మౌలికరంగ పరిశ్రమల పనితీరు నవంబర్‌లో మందకొడిగానే నమోదైంది. ప్రధానంగా సహజవాయువు, ఎరువులు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత పేలవంగా ఉండటంతో.. వృద్ధిరేటు 1.7 శాతానికే పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మౌలిక వృద్ధి 5.8 శాతంగా ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో మైనస్ 0.6 శాతం క్షీణతతో పోలిస్తే.. నవంబర్‌లో తిరిగి వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. బొగ్గు, ముడిచమురు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన 8 రంగాల మౌలిక పరిశ్రమలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 38% వెయిటేజీ ఉంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలంలో మౌలిక వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఇది 6.7%. నవంబర్ ఐఐపీ గణాంకాలపై ఈ మౌలిక వృద్ధి మందగమనం ప్రభావం ఉంటుందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషి పేర్కొన్నారు. అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 1.8 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
రంగాలవారీగా మౌలిక పనితీరు..
- నవంబర్‌లో గ్యాస్ ఉత్పాదకత మైనస్ 11.3 శాతం కుంగింది. గతేడాది ఇదే నెలలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 15 శాతం క్షీణించింది.
- ఇక పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత 29.8 శాతం వృద్ధి నుంచి మైనస్ 5 శాతం క్షీణతలోకి జారిపోయింది.
- ఎరువుల ఉత్పాదకత వృద్ధి 0.6%కే(గత నవంబర్‌లో 5%) పరిమితమైంది.
- ఉక్కు ఉత్పాదకత కూడా వృద్ధి 7.8% నుంచి 3.9 శాతానికి పడిపోయింది.
- సిమెంట్(4.2% వృద్ధి), విద్యుత్(5.9%), బొగ్గు(2.3%), క్రూడ్(1.1%) రంగాలు గతేడాది నవంబర్‌తో పోలిస్తే కాస్త మెరుగైన వృద్ధిని సాధించాయి.