మౌలిక పరిశ్రమల వృద్ధి అంతంతే...
న్యూఢిల్లీ: కీలక మౌలికరంగ పరిశ్రమల పనితీరు నవంబర్‌లో మందకొడిగానే నమోదైంది. ప్రధానంగా సహజవాయువు, ఎరువులు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత పేలవంగా ఉండటంతో.. వృద్ధిరేటు 1.7 శాతానికే పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మౌలిక వృద్ధి 5.8 శాతంగా ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో మైనస్ 0.6 శాతం క్షీణతతో పోలిస్తే.. నవంబర్‌లో తిరిగి వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. బొగ్గు, ముడిచమురు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన 8 రంగాల మౌలిక పరిశ్రమలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 38% వెయిటేజీ ఉంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలంలో మౌలిక వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఇది 6.7%. నవంబర్ ఐఐపీ గణాంకాలపై ఈ మౌలిక వృద్ధి మందగమనం ప్రభావం ఉంటుందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషి పేర్కొన్నారు. అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 1.8 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
రంగాలవారీగా మౌలిక పనితీరు..
నవంబర్‌లో గ్యాస్ ఉత్పాదకత మైనస్ 11.3 శాతం కుంగింది. గతేడాది ఇదే నెలలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 15 శాతం క్షీణించింది.
ఇక పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత 29.8 శాతం వృద్ధి నుంచి మైనస్ 5 శాతం క్షీణతలోకి జారిపోయింది.
ఎరువుల ఉత్పాదకత వృద్ధి 0.6%కే(గత నవంబర్‌లో 5%) పరిమితమైంది.
ఉక్కు ఉత్పాదకత కూడా వృద్ధి 7.8% నుంచి 3.9 శాతానికి పడిపోయింది.
సిమెంట్(4.2% వృద్ధి), విద్యుత్(5.9%), బొగ్గు(2.3%), క్రూడ్(1.1%) రంగాలు గతేడాది నవంబర్‌తో పోలిస్తే కాస్త మెరుగైన వృద్ధిని సాధించాయి.