న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడానికి 100 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టినట్లు శుక్రవారం తెలిపింది. కొత్త ఉత్పత్తి అభివృద్ధి, దేశంలో అదనపు అమ్మకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే 600 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.
2026 నాటికి దేశీయంగా విక్రయాలను మూడింతలు చేయడం ద్వారా ఒక లక్ష యూనిట్లకు, అదే స్థాయిలో ఎగుమతులను చేయాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతకు అదనపు పెట్టుబడి నిదర్శనమని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. మాగ్నైట్ కొత్త వర్షన్‌ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ సైతం తయారీ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 20 మార్కెట్లకు మాగ్నైట్ ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ తయారీతో 65 మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతోందని వివరించారు. నిస్సాన్‌కు ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని టోరెస్ తెలిపారు.
మూడు మోడళ్ల విడుదల..
వచ్చే 30 నెలల్లో కంపెనీ మరో మూడు మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్‌లో రెండు మిడ్–సైజ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి ఐదు సీట్లు, ఇంకొకటి ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.
2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలన్నది ప్రణాళిక అని టోరెస్ వెల్లడించారు. ఆ సమయానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం హైబ్రిడ్, సీఎన్‌జీతో సహా వివిధ పవర్‌ట్రెయిన్స్‌ను కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా 32,000 యూనిట్లను విక్రయిస్తున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. 30 నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం ఉన్న ఒక శాతం నుంచి మూడు శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment