పూనేకి చెందిన ఓ జంట విచిత్రంగా టెక్నాలజీ పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించింది. పెళ్లి అంటే ఠక్కున గుర్తుకు వచ్చే గోల్డ్ చెయిన్‌ని పక్కన పెట్టి బ్లాక్ చెయిన్‌తో ఒక్కటయ్యారు. ఇండియాలోనే ఈ తరహా పెళ్లి జరగడం ఇదే ప్రథమం.
కరోనా వచ్చాక వర్చువల్ పెళ్లిలు, ఆన్‌లైన్‌లో బంధువుల ఆశ్వీర్వాదాలు ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కానీ తాళిబొట్టు మొదలు మెట్టెలు, ఉంగరం ఇలా.. సమస్తం డిజిటల్‌మయంగా ఇండియాలో ఓ పెళ్లి జరిగింది. డిజైనర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అనిల్ నర్సిపురం, శృతి నాయర్‌లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో 2021 నవంబరు 15న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ, పెళ్లి పది కాలాల పాటు చెక్కుచెదరకుండా ఉండేందుకు డిజిటల్ వివాహతంతును నిర్వహించారు.
పూనేకి చెందిన అనిల్ నర్సిపురం, శృతినాయర్‌లు తమ అభిరుచికి తగ్గట్టుగా వెరైటీ పెళ్లి చేసుకున్నారు. టెక్నాలజీని అమితంగా ఇష్టపడే ఈ జంట తమకు నచ్చిన రీతిలో ఇంత వరకు ఎవరూ చూడని స్టైల్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఈథెరమ్ స్మార్ట్ కాంట్రాక్టు పద్దతిని అనుసరించి ఓపెన్ సీ ఫ్లాట్‌ఫామ్‌లో పెళ్లి చేసుకున్నారు.
ముందుగా శృతి తన చేతికి ధరించిన ఎంగేజ్‌మెంట్ ఉంగరం ఫోటోను నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా (ఎన్‌ఎఫ్‌టీ) మార్చారు. ఆ తర్వాత ఈ ఎన్‌ఎఫ్‌టీని అనిల్‌కి బ్లాక్ చెయిన్‌లో పంపించారు. ఈ ఎన్‌ఎఫ్‌టీని అనిల్ రిసీవ్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మొత్తం వ్యవహరానికి 15 నిమిషాల సమయం పట్టగా రెండు ల్యాప్‌ట్యాప్‌లు.. ఓ డిజిటల్ పురోహితుడు అవసరం అయ్యారు. బంధువులు గూగుల్ మీట్‌లో ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లికి పెద్దగా అంటే డిజిటల్ పురోహితుడిగా అనూప్ పక్కీ అనే ఆయన వ్యవహరించారు. ఈ బ్లాక్ చెయిన్ పెళ్లి వ్యవహారమంతా ఆయనే పర్యవేక్షించారు.
ఈ వెరైటీ పెళ్లిపై ఈ జంట స్పందిస్తూ ‘ మేమిద్దరం ఒకరికొకరు తోడుగా నిలవాలి అనుకున్నాం. మమ్మల్నీ మేము అర్థం చేసుకుని జీవించాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరికి ఒకరిపై ఒకరి మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఊరంతా మాకు మద్దతు ఇవ్వాలని కూడా అనుకోలేదు. కలిసి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇరు కుటుంబాలను ఒప్పించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత పెళ్లి చేసుకున్నాం అని చెబుతున్నారు.
చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!!
Comments
Please login to add a commentAdd a comment